కనకరత్నమ్మకు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం: అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.;
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో అల్లు కుటుంబంతోపాటు మెగా ఫ్యామిలీలోకూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే కనకరత్నమ్మ కుమార్తె సురేఖను మెగాస్టార్ చిరంజీవి పెళ్లి చేసుకుని అల్లు ఇంటికి అల్లుడయ్యారు.
కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు కూడా కనకరత్నమ్మ మరణంతో విషాదంలో మునిగిపోయారు. అయితే ఇప్పుడు ఆమె పెద్ద కర్మలో అల్లు అరవింద్.. చిరంజీవితో తన తల్లి అనుబంధం గురించి మాట్లాడారు. కనకరత్నమ్మ, చిరు మధ్య ఎలాంటి అనుబంధం ఉందో వివరించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
"చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా.. ఎంత మెగాస్టార్ అయినా.. కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో అందరికీ తెలియనది కాదు.. కొత్త కాదు.. ఒక రోజు అంటే.. మూడు నెలల క్రితం.. రోజూ అమ్మను పలకరించేవాడిని.. ఒక వేళ ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజు.. ఆమె చేతిపై నా చేయి వేసి నొక్కేవాడిని" అని అల్లు అరవింద్ తెలిపారు.
"నన్ను గుర్తు పడితే చేయి నొక్కమని చెప్పేవాడిని.. ఆమె నొక్కేది.. అంటే గుర్తు పట్టేది అన్నమాట.. నోటితో చెప్పలేకపోవడం వల్ల అలా అలవాటు చేసుకున్నాం.. ఓసారి బాగా సీరియస్ గా ఉన్నప్పుడు.. చిరంజీవి గారు వచ్చారు.. అమ్మా చిరంజీవి గారు వచ్చారు అని చెప్పా.. నేను చిరంజీవిని అని ఆయన అన్నారు" అని అల్లు అరవింద్ చెప్పారు.
"ఆ సమయంలో అమ్మ కళ్లు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. చాలా ఆత్రుతతో కనిపించారు. అలా అంత ఇష్టం చిరంజీవి అంటే ఆమెకు.. వారిద్దరూ ఎప్పుడూ కలిసినా ఒకరని ఒకరని ఆత్మీయంగా హత్తుకుంటారు.. మా తల్లిని అంత ప్రేమగా చిరు చూసుకునేవారు. వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది" అని పేర్కొన్నారు.
కాగా.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ప్రారంభంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటికి ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి కి నటుడిగా మంచి భవిష్యత్తు ఉంటుందనే అల్లు రామలింగయ్య.. పట్టుబట్టి మరీ సురేఖ అని ఇచ్చి పెళ్లి చేశారు. కనకరత్నమ్మ దంపతులు తమ కుమార్తెను మెగాస్టార్ కు కన్యాదానం చేశారు.