ఈసారైనా ట్రాక్‌లో పడేనా?

ఇదే క్రమంలో అల్లరి నరేష్ కెరీర్‌లోనే మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చేశాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న '12ఎ రైల్వే కాలనీ' సినిమా విడుదలకు సిద్ధం అయింది.;

Update: 2025-11-12 05:30 GMT

అల్లరి నరేష్‌ అనగానే ఆయన నటించిన కామెడీ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఒకానొక సమయంలో అల్లరి నరేష్‌ సినిమా వస్తుంది అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుంది, ఒక్కసారి అయినా చూడాలి అనుకున్న ప్రేక్షకులు ఉండేవారు. కానీ కాల క్రమేనా పరిస్థితులు మారుతూ వచ్చాయి. అల్లరోడి సినిమాలు బోర్ కొట్టేశాయి, ఆయన రొటీన్ కామెడీ ని జనాలు తిరస్కరిస్తూ వచ్చారు. దాంతో అల్లరి నరేష్ సినిమాల ఎంపిక విషయంలో గందరగోళం కు గురవుతూ వచ్చాడు. కామెడీ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో సీరియస్ సినిమాలు చేశాడు. సీరియస్ పాత్రలు ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా మళ్లీ నిరాశనే మిగిల్చాయి. తాను కామెడీ చేస్తే చూస్తారనే నమ్మకంతో మరోసారి అల్లరోడు ఆ ప్రయత్నం చేశాడు. మొత్తంగా అల్లరి నరేష్‌ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అల్లరి నరేష్‌ కెరీర్‌లో మొదటి సారి...

ఇదే క్రమంలో అల్లరి నరేష్ కెరీర్‌లోనే మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చేశాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న '12ఎ రైల్వే కాలనీ' సినిమా విడుదలకు సిద్ధం అయింది. నవంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. పొలిమేర తరహా కథ, కథనంతో ఈ సినిమా సాగుతుందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాథ్‌ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే అందించాడు. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు, మొత్తం తానై సినిమాను అనిల్ ముందు ఉండి నడిపించాడు అంటున్నారు. అందుకే పొలిమేర తరహా సినిమా అని, ఆ సినిమా తరహాలోనే ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

12 ఎ రైల్వే కాలనీ సినిమా ట్రైలర్‌..

తాజాగా విడుదలైన ట్రైలర్‌ కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది. సినిమాకు సంబంధించి ఎలాంటి కథ రివీల్‌ కాకుండా, స్క్రీన్‌ ప్లే విషయంలో ఆసక్తి కలిగే విధంగా, పాత్రలను విభిన్నంగా చూపిస్తూ ట్రైలర్‌ కట్‌ ఉంది. దాంతో సినిమాపై ఆసక్తి పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు కామెడీ, సీరియస్ పాత్రలు, సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ మొదటి సారి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలను చేసేందుకు రెడీ కావడంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ప్రేక్షకులను మెప్పించేందుకు, ఇండస్ట్రీలో మరికొంత కాలం హీరోగా కొనసాగేందుకు అల్లరోడు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి. అందుకే ఈ సినిమా ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లరోడి ఈ కొత్త ప్రయత్నం సఫలం అయితే ముందు ముందు ఆయన నుంచి మరిన్ని సస్పెన్స్‌ థ్రిల్లర్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

నా సామిరంగ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో...

12ఎ రైల్వే కాలనీ సినిమా ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ చాలా కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేశాడు. తప్పకుండా ఈ సినిమా మెప్పిస్తుంది అంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. నా సామిరంగ సినిమా నిర్మాత శ్రీనివాస చిట్టూరి తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు చాలా కథలు విన్నాం. చివరకు ఈ కథను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సినిమాను చాలా తక్కువ సమయంలో పూర్తి చేశాం. సినిమాలోని మెజార్టీ సీన్స్ ఒక ఇంట్లో చిత్రీకరణ చేయాల్సి వచ్చింది. ఒక రూంలో ఒక సీన్‌ తీస్తూ ఉంటే మరో రూంలో మరో సీన్‌ ఏర్పాట్లు చేయడం వల్ల తక్కువ సమయంలో షూట్‌ పూర్తి చేశాం. 41 రోజుల్లో మొత్తం సినిమాను పూర్తి చేయగలిగాం అని అల్లరి నరేష్‌ అన్నాడు. నా కెరీర్‌ లో మొదటి సారి ఇలాంటి సినిమాను చేస్తున్నాను. తప్పకుండా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉందని అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News