అరుదైన వినికిడి సమస్యతో బాధపడుతోన్న ప్రఖ్యాత గాయని!
సంగీత ప్రపంచంలో మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాలగా కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని అల్కా యాగ్నిక్.;
సంగీత ప్రపంచంలో మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాలగా కోట్లాది మందిని అలరించిన దిగ్గజ గాయని అల్కా యాగ్నిక్. ప్రస్తుతం ఆమె క్లిష్టమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా ఆల్కా యాగ్నిక్ ఒక అరుదైన వినికిడి రుగ్మతతో పోరాడుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. అకస్మాత్తుగా తలెత్తిన ఆరోగ్య సమస్య కారణంగా ఆల్కా తన సంగీత ప్రయాణానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. అల్కా యాగ్నిక్ ఎదుర్కొంటున్న ఈ సమస్యను వైద్య భాషలో `సెన్సోరీన్యూరల్ నర్వ్ హియరింగ్ లాస్అని పిలుస్తారు.
విమాన ప్రయాణం ముగించుకుని బయటకు వస్తోన్న సమయంలో ఆమెకు అకస్మాత్తుగా వినిపించకుండా పోయింది. తొలుత సాధారణ సమస్య అనుకు న్నప్పటికీ వైద్య పరీక్షల అనంతరం ఇదొక అరుదైన వైరల్ అటాక్ వల్ల కలిగిన వినికిడి లోపమని నిర్ధారణ అయింది. అప్పటి నుండి ఆల్కా ఇబ్బంది పడుతు న్నారు.అనారోగ్య కారణం వల్ల కొత్తగా ఎలాంటి పాటలు అంగీకరించడం లేదు. ఎంతో మంది సంగీత దర్శకులు ఇప్పటికీ పాటల కోసం సంప్రదిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో న్యాయం చేయలేననే ఉద్దేశంతో ఆమె వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరిస్తున్నారు.
వినికిడి లోపం అనేది ఒక గాయనిగా ఆమె వృత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతు న్నప్పటికీ ఎంతో ధైర్యంతో ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ఏడాది భారత ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మకమైన `పద్మ భూషణ్` పురస్కారంతో గౌరవించింది. ఈ గౌరవం ఆమెకు ఎంతో ఊరటని చ్చినప్పటికీ తన గాత్రం మళ్లీ ఎప్పుడు యథాస్థితికి చేరుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు. చివరిగా 2024లో విడుదలైన `అమర్ సింగ్ చమ్కీలా` చిత్రంలోని `నరమ్ కాల్జా` పాటలో వినిపించింది. అదే ఆమె చివరి పాట. ఈ గ్యాప్ లో ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నారు.
దీంతో అల్కా యాగ్నిక్ త్వరగా కోలుకోవాలని యావత్ సంగీత ప్రపంచం కోరుకుంటోంది. అలాగే సంగీత ప్రియులకు ఓ విజ్ఞప్తి కూడా చేసారు. అతి పెద్ద శబ్దంతో కూడిన సంగీతం వినడం, నిరంతరం హెడ్‌ఫోన్స్ వాడటం వంటివి వినికిడి శక్తిపై ఎంతటి ప్రమాదాన్ని చూపుతాయో ఆమె తన అనుభవం ద్వారా హెచ్చరిక జారీ చేశారు.ఆల్కా యాగ్నిక్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరించాలని కోరుకుందాం.
అల్కా యాగ్నిక్ హిందీతో పాటు తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, అస్సామీ, ఒడియా వంటి దాదాపు 25 భాషల్లో పాటలు పాడారు. కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా తన గొంతును వినిపించారు. అయితే ప్రధానంగా డబ్బింగ్ సినిమాల్లోని పాటలు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోని పాటల ద్వారా ఆమె గొంతు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆల్కా యాగ్నిక్ పాడిన ఎన్నో హిందీ పాటలు తెలుగులో కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి.