ఇద్దరు స్టార్ హీరోలు నటించినా ఓపెనింగులు భేజారు
బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం `హైవాన్` బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను ఎదుర్కొంటోంది.
బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం `హైవాన్` బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను ఎదుర్కొంటోంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా తొలి రోజు వసూళ్లు మాత్రం భేజారుగా మారాయి. మలయాళంలో మోహన్‌లాల్ నటించి సంచలన విజయం సాధించిన `ఒప్పం` చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు కేవలం రూ. 3 కోట్లు మాత్రమే వసూలు కావడం గమనార్హం. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించినా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ రాకపోవడం అక్షయ్ కుమార్‌కు మరో గట్టి జోల్ట్ గా భావించాలి.
సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తుండటంతో పాటు.. నెటిజన్లు దీనిపై రకరకాల మీమ్స్‌తో జోరుగా ట్రెండ్ చేస్తున్నారు. ప్రియదర్శన్ పాత కాలపు కాన్సెప్ట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారని.. నేటి ట్రెండ్‌కు తగినట్లుగా కథలో ఎలాంటి కొత్తదనం జోడించలేదంటూ విమర్శకులు పెదవి విరిచేస్తున్నారు. రొటీన్ రీమేక్ ఫార్ములా ఇకపై బాలీవుడ్ ప్రేక్షకులకు ఎక్కడం లేదనేదానికి `హైవాన్` ఫలితమే నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న చిత్రాలకు ఇటీవల కాలంలో సరైన ఫలితాలు రావడం లేదనే సెంటిమెంట్ కూడా ఈ సినిమాపై ప్రభావం చూపింది.
మరోవైపు సినిమాలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ నటన బాగుందంటూ కొందరు అభిమానులు ప్రశంసిస్తున్నా.. ఓవరాల్‌గా సినిమాపై పడిన నెగెటివ్ టాక్ కలెక్షన్లను దెబ్బతీసింది. ఫ్రేమ్-టు-ఫ్రేమ్ కాపీ కొట్టడం వల్ల ఇప్పటికే మలయాళ మూల చిత్రం చూసిన వారికి ఇందులో కిక్ లేకుండా పోయిందని.. థ్రిల్లర్ జోనర్‌లో ఉండాల్సిన ఉత్కంఠ లోపించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగడం.. బలహీనమైన కథనం సినిమాను మరింత వెనక్కి నెట్టాయి.
అయితే ఒరిజినల్ `ఒప్పం` సినిమాను ఎప్పుడూ చూడని కొత్త ప్రేక్షకులకు మాత్రం ఈ సస్పెన్స్ డ్రామా కొంతవరకు డీసెంట్ అనుభూతిని ఇస్తుందనే మాట కూడా వినిపిస్తోంది. బోమన్ ఇరానీ, రాజ్‌పాల్ యాదవ్ వంటి నటుల అభినయం... క్లైమాక్స్ ఫేస్-ఆఫ్ సీన్స్ అక్కడక్కడ పర్వాలేదనిపించినా.. కమర్షియల్ స్థాయిలో సినిమాను నిలబెట్టడానికి అవి సరిపోలేదు. బాక్సాఫీస్ వద్ద వీకెండ్ గడిచేకొద్దీ కలెక్షన్స్ పుంజుకోకపోతే సినిమా నిలదొక్కుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తానికి అక్షయ్ కుమార్-ప్రియదర్శన్ కాంబో అనగానే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను `హైవాన్` అందుకోలేకపోయింది. వరుస విజయాలతో దూసుకుపోవాలని భావిస్తున్న అక్షయ్ కుమార్‌కు ఈ సినిమా రూపంలో మరో ఎదురుదెబ్బ తగలడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మారుతున్న కాలానికి తగినట్లుగా సరికొత్త కథలతో వస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారని... పాత రీమేక్ ఫార్ములాలు ఇకపై వర్కవుట్ కావని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. మొదటిరోజు కేవలం 3 కోట్ల వసూళ్లు అంటే ఇద్దరు స్టార్ హీరోలకు అవమానం. తెలుగులో ఇదే వారంలో విడుదలైన ఒక అప్ కమ్ హీరో సినిమా వసూళ్లు 1.5 కోట్లు. దీనిని బట్టి బాలీవుడ్ స్టార్లు చేసిన మిస్టేక్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.