అఖిల్ కొత్త సినిమా.. ఇది మరో సమస్య!
ఇదే టీజర్ గ్లింప్స్ లో హీరోయిన్ శ్రీలీలను కూడా చూపించారు. రెండు జడలు వేసుకొని పల్లెటూరి అమ్మాయిలా శ్రీలీలను పరిచయం చేశారు.;
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేనికి బ్లాక్ బస్టర్ విజయం అందని ద్రాక్షలా ఉంది. అతడు కెరీర్లో 10ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇంకా భారీ విజయం అందుకోలేదు. ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. భారీ అంచనాలతో 2023లో వచ్చిన ఏజెంట్ తీవ్రంగా నిరాశ పర్చింది. ఇది ఒక డిజాస్టర్గా మిగిలిపోయింది.
ఇక హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఫర్వాలేదని పించినా అక్కినేని అభిమానులు ఇంకా అఖిల్ నుంచి ఏదో కోరుకుంటున్నారు. దీంతో చాలా గ్యాప్ తీసుకొని ఆచి తూచి అడుగురు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన లెనిన్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా పక్కా హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ ఏప్రిల్లో అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఇందులో అఖిల్ మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్ లో చూపించారు. మాస్ గా కనిపించారు. ఇదే టీజర్ గ్లింప్స్ లో హీరోయిన్ శ్రీలీలను కూడా చూపించారు. రెండు జడలు వేసుకొని పల్లెటూరి అమ్మాయిలా శ్రీలీలను పరిచయం చేశారు.
అయితే ఈ సినిమా షుూటింగ్ నుంచే ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగా ఇందులో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికవ్వగా, ఆమె రెండు, మూడు వారాల షూటింగ్ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల తప్పుకోవడంతో మరో యంగ్ నటి భాగ్య శ్రీ బోర్సేను కొత్త హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం.
అయితే ఇక్కడే నిర్మాతలకు అసలు తలనొప్పి వచ్చి పడింది. తొలుత శ్రీలీలపై చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ సన్నివేశాలను మళ్లీ రీ షూట్ చేయాల్సి ఉంది. దీంతో సమయంతో పాటు ప్రొడక్షన్ ఖర్చు కూడా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరులో మళ్లీ షూటింగ్ ప్రారంభించారట. పల్లెటూరి సెట్స్ వేశారట. ఇది మేకర్స్ కు అదనపు భారంగా మారింది.
కాగా, ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ జానర్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అంతా అనుకున్నట్లు షూటింగ్ జరిగితే 2026లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది!