అఖండ 2 నుండీ అదిరిపోయే అప్డేట్.. 600 మంది డాన్సర్స్ తో..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణతో పాటు 600 మంది డాన్సర్స్ తో ఒక భారీ మాస్ పాటను చిత్ర బృందం తాజాగా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. భాను మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.;
అఖండ.. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఊహించని విజయాన్ని సొంతం చేసుకొని.. ఈ కాంబినేషన్ కి మరింత పాపులారిటీ అందించింది. ఈ సినిమా తీసుకొచ్చిన విజయంతో ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. అలా ' అఖండ 2: తాండవం' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. నిజానికి సెప్టెంబర్ 25వ తేదీన పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాకి పోటీగా ఈ సినిమాను బరిలోకి దింపుతున్నట్లు మేకర్స్ ప్రకటించినా.. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు.. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన బాలయ్య కూతురు తేజస్విని ఒక లాంగ్ నోట్ విడుదల చేస్తూ స్పష్టం చేసింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో వచ్చే ఏడాది దింపబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బాలకృష్ణతో పాటు 600 మంది డాన్సర్స్ తో ఒక భారీ మాస్ పాటను చిత్ర బృందం తాజాగా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. భాను మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఒక రేంజ్ లో బిజిఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్లుతెలుస్తోంది. అఖండ సినిమాలో " జై బాలయ్య" పాట ఎలా అయితే సూపర్ హిట్ అయిందో.. ఈ సినిమాలో ఈ పాట అంతకుమించి బిగ్ బ్యాంగర్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ స్టెప్స్ ఈ పాటలో ప్రత్యేకంగా ఉండనున్నాయని, ఈ పాట కోసం చాలా జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.
అఖండ 2 సినిమా విషయానికి వస్తే.. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో సంయుక్త హీరోయిన్గా నటిస్తూ ఉండగా హర్షాలీ మల్హోత్ర, ప్రముఖ సీనియర్ నటి శోభనతో పాటు ప్రగ్యా జైశ్వాల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో హర్షాలీ మల్హోత్రా జననీ పాత్రను పోషిస్తుంది. ఈమె ఇదివరకే 'బజరంగీ భాయిజాన్' సినిమాలో మున్ని పాత్రతో భారీ పాపులారిటీ అందుకున్న విషయం తెలిసిందే. అటు శోభన ఇందులో సన్యాసి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
అంతేకాదు ప్రముఖ సీనియర్ హీరోయిన్ లయ కూతురు శ్లోక కూడా ఈ సినిమా ద్వారా వెండితెరపైకి అడుగులు వేస్తోంది. మొత్తానికైతే భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాలయ్యకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.