అఖండ 2 మేకర్స్.. హైకోర్టులో రిలీఫ్
తెలంగాణలో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2: తాండవం మూవీకి సంబంధించి టికెట్ ధరలతోపాటు ముందస్తు ప్రీమియర్ల వ్యవహారం ప్రస్తుతం ఆ రాష్ట్ర హైకోర్టులో ఉన్న విషయం తెలిసిందే.;
తెలంగాణలో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ 2: తాండవం మూవీకి సంబంధించి టికెట్ ధరలతోపాటు ముందస్తు ప్రీమియర్ల వ్యవహారం ప్రస్తుతం ఆ రాష్ట్ర హైకోర్టులో ఉన్న విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లింది.
అయితే 14 రీల్స్ ప్లస్ సంస్థ దాఖలు చేసిన లంచ్ మోషన్ పై డివిజన్ బెంచ్ శుక్రవారం మధ్యాహ్నం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డిసెంబర్ 14వ తేదీ వరకు స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది. దీంతో అఖండ 2 నిర్మాణ సంస్థకు తాత్కాలిక ఊరట లభించినట్టైంది.
అంతకుముందు, తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు, ముందస్తు ప్రీమియర్లపై దాఖలైన పిటిషన్ పై గురువారం సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రీమియర్ లను రద్దు చేయాలని, టికెట్ రేట్లను పెంచకూడదని ఇప్పటికే న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ టికెట్ ధరలను మేకర్స్ యథేచ్ఛగా పెంచారని పిటిషనర్లు హైకోర్టులో వాదించారు.
బుక్ మై షో వంటి ప్లాట్ ఫారమ్ లలో అధిక ధరలతోనే టికెట్ల విక్రయాలు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సింగిల్ బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రతి సినిమా వచ్చినప్పుడూ ఇలాగే ధరలు పెంచుతుంటారని, అలా పెంచాల్సిన పరిస్థితి ఏంటని బెంచ్ ప్రశ్నించింది. హోంమంత్రిత్వశాఖపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.
కోర్టు ఉత్తర్వులను కావాలని ఉల్లంఘిస్తున్నారని హైకోర్టు సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను సవాల్ చేయకుండానే తిరిగి సర్క్యులర్ జారీ చేస్తున్నారని తెలిపింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కోర్టు ఆదేశాలు తెలియదా అని ప్రశ్నించింది. దీంతో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు కూడా జారీ చేసింది.
ఆ తర్వాత తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. టికెట్ ధరలను పెంచుతూ హోం శాఖ జారీ చేస్తున్న మోమోను కోర్టు రద్దు చేయగానే ఉపసంహరించుకోవాలని తెలిపింది. హోం శాఖ ఉన్నతాధికారికి గతంలో హైకోర్టు ఆదేశాలు తెలియవా అని అడిగింది. దీంతో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ 14 రీల్స్ ప్లస్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. లంచ్ మోషన్ విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించింది.