నిర్మాతలు అలా.. డైరెక్టర్ ఇలా.. ఏం జరుగుతోంది?
బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.;
బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా రూపొందిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్డంకులను దాటుకుని థియేటర్స్ లో రిలీజైంది. ముందు రోజు ప్రీమియర్స్ కూడా పడ్డాయి. అలా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా.. డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కు నిర్మాతలు.. శుక్రవారం ఈవెనింగ్ సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. అందులో ప్రొడ్యూసర్లు రామ్ ఆచంట, గోపి ఆచంట పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రీమియర్స్ ద్వారా రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలిపారు. ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు.
అంతే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే అక్కడికి కాసేపటికే డైరెక్టర్ బోయపాటి శ్రీను.. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. కేక్ కట్ చేసి టపాకులు కాల్చారు. ఆ సమయంలో బోయపాటి శ్రీను తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఉన్నారు.
అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెగ చక్కర్లు కొడుతూ కొత్త డిస్కషన్ స్టార్ట్ అయ్యేలా చేశాయి. ఎందుకంటే.. ముందు జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్ కు నిర్మాతలు గోపి ఆచంట, రామ్ ఆచంట మాత్రమే హాజరయ్యారు. డైరెక్టర్, హీరో సహా ఎవరూ అటెండ్ అవ్వలేదు.
ఆ తర్వాత జరిగిన సెలబ్రేషన్స్ లో బోయపాటి శ్రీను, తమన్ సందడి చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందోనని కొందరు సినీ ప్రియులు, అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకలా వేర్వేరుగా గంటల గ్యాప్ లో సక్సెస్ ప్రెస్ మీట్ తో పాటు ప్రసాద్ ల్యాబ్స్ లో సెలబ్రేషన్ ను నిర్వహించారని క్వశ్చన్ చేస్తున్నారు.
అయితే యాదృశ్చికంగా అలా చేసి ఉంటారని ఇంకొందరు అంటున్నారు. ఇదంతా అఖండ 2 ఆర్థిక గందరగోళం వల్లే జరిగిందేమోనని మరికొందరు నెటిజన్లు అనుమానపడుతున్నారు. ఎందుకంటే అఖండ 2 రిలీజ్ కు ముందు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ కు ఆర్థిక సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈరోస్ నిర్మాణ సంస్థకు బకాయిలు ఉండడంతో పోస్ట్ పోన్ చేయమని మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ సమయంలో 14 రీల్స్ ప్లస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.