అఖండ 2 గొడవ: టైమ్ చూసి కొట్టారా?

బుధవారం రాత్రి నుంచే ఈ సమస్యను పరిష్కరించడానికి పెద్దలు రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ బకాయి మొత్తం పెద్దది కావడం, కోర్టు పరిధిలో విషయం ఉండటంతో చర్చలు ఫలించలేదు.;

Update: 2025-12-05 05:13 GMT

బాలయ్య అభిమానులకు ఇది మింగుడుపడని నిజం. షో పడటానికి కేవలం కొన్ని గంటల ముందు సినిమా ఆగిపోవడం అనేది ఊహించని పరిణామం. టికెట్లు చేతిలో పట్టుకుని థియేటర్ల దగ్గర వేచి చూసిన ఫ్యాన్స్ నిరాశ అంతా ఇంతా కాదు. బాలకృష్ణ కెరీర్ లోనే ఇలా రిలీజ్ రోజున సినిమా వాయిదా పడటం ఇదే తొలిసారి కావచ్చు. ఇంతటి భారీ ప్రాజెక్ట్, అంతటి క్రేజ్ ఉన్న సినిమా సడెన్ గా బ్రేక్ అవ్వడానికి వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అసలు ఈ సమస్య ఈ రోజుది కాదని, దీని వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. 14 రీల్స్ సంస్థకు, బాలీవుడ్ కార్పొరేట్ కంపెనీ ఈరోస్ ఇంటర్నేషనల్ కు మధ్య ఉన్న పాత ఆర్థిక లావాదేవీలే ఇప్పుడు 'అఖండ 2'కు అడ్డంకిగా మారాయని టాక్ వస్తోంది. గతంలో మహేష్ బాబుతో చేసిన '1: నేనొక్కడినే', 'ఆగడు' సినిమాల సమయంలో ఏర్పడిన బకాయిలు ఇంకా క్లియర్ కాలేదట. అవి వడ్డీలతో కలిపి ఇప్పుడు దాదాపు రూ. 28 కోట్ల వరకు చేరాయని టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా ఒక ప్రొడక్షన్ హౌస్ పాత బాకీలు ఉన్నప్పుడు, కొత్త సినిమా రిలీజ్ టైమ్ లోనే వాటిని సెటిల్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే 'సర్కారు వారి పాట' సమయంలో వేరే నిర్మాతలు కూడా భాగస్వాములుగా ఉండటంతో ఆ సినిమాకు ఇబ్బంది రాలేదు. కానీ 'అఖండ 2' సోలోగా చేస్తుండటంతో, పాత లెక్కలు సరిచూసుకోవడానికి ఈరోస్ సంస్థ ఇదే సరైన సమయంగా భావించి కోర్టును ఆశ్రయించింది. రిలీజ్ టైమ్ లో అయితేనే రికవరీకి ఛాన్స్ ఉంటుందనేది కార్పొరేట్ సంస్థల స్ట్రాటజీ.

బుధవారం రాత్రి నుంచే ఈ సమస్యను పరిష్కరించడానికి పెద్దలు రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ బకాయి మొత్తం పెద్దది కావడం, కోర్టు పరిధిలో విషయం ఉండటంతో చర్చలు ఫలించలేదు. దీంతో చివరి నిమిషంలో వాయిదా తప్పనిసరి అయ్యింది. దీనివల్ల ఎవరి తప్పు ఎంత అనే దానికంటే, ఒక మంచి సినిమా సరైన సమయానికి రాలేకపోయిందనే బాధే సినీ ప్రేమికుల్లో ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు తీర్పు మీదే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. బకాయిలు చెల్లిస్తేనే రిలీజ్ కు అనుమతి ఇస్తామని కోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఎంత త్వరగా ఈ సమస్య కొలిక్కి వస్తే అంత త్వరగా సినిమా థియేటర్లలోకి వస్తుంది.

ఏదేమైనా పాత లావాదేవీలు ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు ఇలా బ్రేకులు వేస్తాయని ఎవరూ ఊహించలేదు. లీగల్ ఇష్యూస్ క్లియర్ అయ్యి, బాలయ్య బాక్సాఫీస్ తాండవం ఎప్పుడు మొదలవుతుందో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో వచ్చే రూమర్స్ ను నమ్మకుండా, అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేయడం మంచిది.

Tags:    

Similar News