ఓల్డ్ ఈజ్ గోల్డ్: తళా అజిత్ క్యూటీని ఎత్తుకుని దళపతి విజయ్ ముచ్చట
తమిళ చిత్రసీమను దశాబ్దాలుగా ఏలుతున్న ఇద్దరు ధృవతారలు తళా అజిత్ - దళపతి విజయ్.;
తమిళ చిత్రసీమను దశాబ్దాలుగా ఏలుతున్న ఇద్దరు ధృవతారలు తళా అజిత్ - దళపతి విజయ్. వీరిద్దరూ కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా ఎదిగిన తీరు సినీ అభిమానులకు ఒక గొప్ప స్ఫూర్తి. అయితే ప్రస్తుతం కాలం మారింది. దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పి, రాజకీయాల్లో అడుగుపెట్టి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల సినీ వారసత్వాన్ని రాజకీయాల్లో కొనసాగిస్తూ ప్రజల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. మరోవైపు అజిత్ తన రేస్ ట్రాక్‌లపై జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తూ పరిమితంగా సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు.
నిజానికి అజిత్, విజయ్ మధ్య వృత్తిపరమైన పోటీ ఉన్నా.. వ్యక్తిగతంగా వారిద్దరూ మంచి స్నేహితులు. కానీ సోషల్ మీడియా వేదికగా గత కొన్నేళ్లుగా వీరిద్దరి అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ మాత్రం హద్దులు దాటుతున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం, అజిత్ సినిమాల వేగం తగ్గించడంతో కోలీవుడ్ ఈ ఇద్దరు దిగ్గజాలను వెండితెరపై చాలా మిస్ అవుతోంది. ఇలాంటి తరుణంలో ఒక అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేసిన `ఓల్డ్ ఈజ్ గోల్డ్` త్రోబ్యాక్ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
వైరల్ అవుతున్న ఈ అరుదైన వీడియోలో అజిత్ -షాలిని దంపతుల ముద్దుల కుమార్తె అనౌష్కను దళపతి విజయ్ ఎంతో మురిపెంగా ఎత్తుకుని ఆడిస్తున్నారు. అప్పటికి విజయ్ వయసు బహుశా ముప్పై ఏళ్లలోపే ఉంటుంది. అజిత్ కుటుంబంతో విజయ్‌కి ఉన్న అనుబంధాన్ని ఈ వీడియో కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ఆ చిన్నారితో విజయ్ ఆడుకుంటున్న తీరు వారి మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంగా నిలుస్తోంది. అగ్ర హీరోల మధ్య ఉన్న ఈ సామరస్యం అప్పట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రతిబింబించేది.
ఈ త్రోబ్యాక్ వీడియో కేవలం హీరోల స్నేహాన్ని మాత్రమే కాకుండా వారి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా చాటిచెబుతోంది. ఒక ఈవెంట్‌లో విజయ్ తన భార్య సంగీత సోర్నలింగంతో కలిసి హాజరుకాగా.. అక్కడ షాలిని - సంగీత ఇద్దరూ అక్కాచెల్లెళ్లలా కలిసిపోయి ముచ్చటించడం విశేషం. సినీ ఇండస్ట్రీలోని దిగ్గజాలంతా హాజరైన ఆ వేడుకలో అజిత్-విజయ్ కుటుంబాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం.
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో నిరంతరం గొడవ పడే అభిమానులకు ఈ వీడియో ఒక గట్టి సందేశాన్ని ఇస్తోంది. తాము ఆరాధించే హీరోలు ఇంతటి స్నేహభావంతో ఉన్నప్పుడు అభిమానులు ఎందుకు గొడవ పడాలనే సందేహాన్ని రేకెత్తించింది. ఏదేమైనా వెండితెరను ఏలిన ఈ ఇద్దరు స్టార్ల అరుదైన జ్ఞాపకం ఇప్పుడు నెటిజన్లకు తీపి గుర్తుగా మిగిలిపోయింది. దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా తమిళనాడుకు సేవలందించేందుకు సిద్ధమైన వేళ ఈ త్రోబ్యాక్ వీడియో మరోసారి వైరల్ గా మారుతోంది. ఆ నాటి పార్టీలో కోలీవుడ్ నుంచి దిగ్గజాలందరూ హాజరయ్యారు.