ద‌ళ‌ప‌తికి ఎదురు దెబ్బ‌లు.. 2032లో త‌ళా అజిత్ పొలిటిక‌ల్ ఎంట్రీ?

తాజాగా ఒక ప్రముఖ జ్యోతిష్కుడు చేసిన అంచనా ప్రకారం.. అజిత్ 2032లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది.;

Update: 2026-03-15 05:27 GMT

తమిళనాడు రాజకీయాల్లో సినిమా తారల ప్రభావం ఎప్పుడూ ఎక్కువే. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాలు వెండితెర నుండి వచ్చి రాష్ట్రాన్ని పాలించిన చరిత్ర ఉంది. అయితే ప్రస్తుత తరం స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం మాత్రం ఆశించిన స్థాయిలో సాఫీగా సాగడం లేదు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఏవో అడ్డంకులు ఇబ్బందిక‌రంగా మారాయి. అత‌డి చుట్టూ ముసురుతున్న వ్యక్తిగత వివాదాలు, ఫ్యామిలీ డ్రామాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా భార్య సంగీతతో విడాకుల వ్యవహారం, కుమారుడు కూడా తండ్రికి దూరంగా ఉండటం వంటి అంశాలు ప్రత్యర్థులకు బలమైన అస్త్రాలుగా మారాయి.

విజయ్ రాజకీయ ప్రయాణానికి ముందు నుంచే వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆయన నటించిన రాజకీయ నేపథ్యంలో సాగే `జననాయగన్` సినిమా విడుదల కాకపోవడం ఒక పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది. సినిమాల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలనుకున్న విజయ్ ప్లాన్ ఇక్కడ బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు ఆయనపై వస్తున్న రకరకాల విమర్శలు, వివాదాలు ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. దీంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక మెలోడ్రామాలా తయారైందని.. దీనివల్ల ఆయనకు రాజకీయంగా పెద్దగా కలిసి వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. విజ‌య్ సీఎం అవుతాడా లేదా పార్టీని నిల‌బెడ‌తాడా లేదా? ఇవ‌న్నీ ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల్లోనే డైల‌మాలుగా మారాయి.

ఇలాంటి పరిస్థితుల్లో `తళా` అజిత్ కుమార్ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర చర్చ మొదలైంది. అజిత్‌కు దివంగత ముఖ్యమంత్రి జయలలిత- ఏఐఏడిఎంకే పార్టీ తో ఉన్న సత్సంబంధాలు ఇప్పుడు ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. జయలలిత బతికున్నప్పుడు అజిత్‌ను తన రాజకీయ వారసుడిగా భావించారనే వార్తలు గతంలో విపరీతంగా వచ్చాయి. ప్రస్తుతం అన్నా డీఎంకే (AIADMK) పార్టీ సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అజిత్ వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నటుడు పార్టీలోకి వస్తే పూర్వ వైభవం రావడం ఖాయమని పార్టీ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు.

తాజాగా ఒక ప్రముఖ జ్యోతిష్కుడు చేసిన అంచనా ప్రకారం.. అజిత్ 2032లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తోంది. ఇది కేవలం ఒక అంచనా మాత్ర‌మే అయినా కానీ.. తమిళనాడు రాజకీయాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. సహజంగానే అందరి కళ్లు అజిత్ వైపు మళ్లుతున్నాయి. 2032 నాటికి అజిత్ తన సినిమా కమిట్‌మెంట్స్ పూర్తి చేసుకుని పరిణతి చెందిన నాయకుడిగా రంగంలోకి దిగుతారని.. అన్నా డీఎంకే పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తారని ఈ విశ్లేషణల సారాంశం.

అజిత్ కుమార్ వ్యక్తిత్వం ఆయనకు రాజకీయాల్లో పెద్ద బలం. ప్రచారానికి ఆమడ దూరంగా ఉండటం.. తన పని తాను చేసుకుపోవడం.. అభిమాన సంఘాలను రద్దు చేసినా ఆయనపై అభిమానం తగ్గకపోవడం వంటివి అజిత్ ప్రత్యేకతలు. రాజకీయాల్లోకి రాకముందే ఆయనకున్న ఈ `సింప్లిసిటీ`, `డిగ్నిటీ` ప్రజలను ఆకట్టుకుంటాయి. జయలలిత తర్వాత తమిళనాడును పాలించే స్థాయి ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారంటే అది అజిత్ మాత్రమేనని అటు అభిమానులు, ఇటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి తమిళనాడు రాజకీయ రణక్షేత్రం భ‌విష్య‌త్ లో మరిన్ని మలుపులు తిరగనుంది. ఒకవైపు విజయ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. మరోవైపు అజిత్ ఎంట్రీపై సాగుతున్న ప్రచారం తమిళ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి. 2032లో తళా అజిత్ నిజంగానే రాజకీయాల్లోకి వచ్చి అన్నా డీఎంకే పార్టీకి ఊపిరి పోస్తారా? జయలలిత వారసుడిగా కీల‌క‌మైన‌ పీఠాన్ని అధిరోహిస్తారా? అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ఈ `రియల్ లైఫ్‌ రేసర్` తన పొలిటికల్ రేస్ గురించి ఆలోచించే అవ‌కాశం ఉంద‌నే వార్త మాత్రం అటు కోలీవుడ్‌లో ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Tags:    

Similar News