అజిత్‌కు ఇదే అతిపెద్ద సమస్యనా?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తదుపరి సినిమా చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తదుపరి సినిమా చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకప్పుడు నిర్మాతలు క్యూ కట్టే స్థాయిలో ఉన్న స్టార్ హీరోలకు ఇప్పుడు మార్కెట్ వాస్తవాలు కొత్త సవాళ్లు విసురుతున్నాయనే చర్చకు అజిత్ ఉదాహరణగా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆయన డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న 100కోట్ల రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇటీవల అజిత్, డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో మరో సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ స్టోరీ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా ముందుకు రావాల్సిన సంస్థలు ఆర్థిక అంశాల కారణంగా వెనక్కి తగ్గినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గతంలో అజిత్‌తో మంచి సక్సెస్‌ను అందుకున్న నిర్మాణ సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందడుగు వేయలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.
ఇదే టైమ్ లో డైరెక్టర్ సిరుత్తై శివతో కూడా అజిత్ మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంటే అజిత్ వద్ద రెండు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని పట్టాలెక్కించే నిర్మాత మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదన్న మాట. ఈ పరిస్థితి అజిత్ రెమ్యూనరేషన్ చుట్టూ ఉన్న డిస్కషన్స్ కు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 100కోట్ల రెమ్యూనరేషన్ సమంజసమేనా? గత కొన్నేళ్లుగా ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా నిర్మాతలకు వచ్చిన భారీ ఆదాయం క్రమంగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు కూడా గతంలోలాగా భారీ మొత్తాలు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో సినిమా బడ్జెట్‌లపై నిర్మాతలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్టార్ హీరోల రెమ్యూనరేషన్ లపై కూడా రియాలిటీ చెక్ జరుగుతోంది. ఒకప్పుడు మార్కెట్ ఊపుతో భారీ మొత్తాలు అందుకున్న పలువురు అగ్ర హీరోలు ఇప్పుడు తమ రెమ్యూనరేషన్ విషయంలో కొంత మేర సర్దుబాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే నిర్మాతలకు లాభదాయకమైన మోడల్ లేకపోతే భారీ ప్రాజెక్టులు ప్రారంభించడం కష్టంగా మారుతోంది.
అజిత్ విషయంలో కూడా ఇదే అంశం చర్చకు వస్తోంది. ఆయన స్టార్‌డమ్‌పై ఎలాంటి సందేహాలు లేకపోయినా, ప్రస్తుత బిజినెస్ లెక్కలు మాత్రం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రూ.100 కోట్ల స్థాయిలో డిమాండ్ కొనసాగితే నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉందని, అదే పారితోషికం రూ.50 కోట్ల పరిధిలో ఉంటే ప్రాజెక్టులు వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో అజిత్ కెరీర్ ఇప్పుడు ఆసక్తికరమైన దశలో నిలిచింది. స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి, డైరెక్టర్లు రెడీగా ఉన్నారు. కానీ మార్కెట్ వాస్తవాలకు అనుగుణంగా తీసుకునే నెక్ట్స్ డెసిషనే ఆయన కొత్త సినిమాల భవితవ్యాన్ని నిర్ణయించనుందనే చర్చ కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది.