కీర్తి సురేష్‌ నిజంగా గ్రేట్‌.. ఈ మాటలే సాక్ష్యం

'మహానటి' సినిమాతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌.;

Update: 2025-11-27 05:54 GMT

'మహానటి' సినిమాతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. హీరోయిన్‌గా ప్రస్తుతం తమిళ్‌, హిందీ, తెలుగు సినిమాలను చేయడంతో పాటు, తన అవసరం ఉంది అనిపిస్తే వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించేందుకు రెడీగా ఉంటుంది. ఆకట్టుకునే అందం తో పాటు నటిగా మంచి పేరును సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహానటి సినిమాలో ఈమె నటనకు జాతీయ స్థాయిలో మంచి పేరు దక్కిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినప్పటికీ ఇంకా స్టార్‌ హీరోయిన్‌గానే వరుస సినిమాలను చేస్తూ దూసుకు పోతుంది. తాజాగా ఈ అమ్మడు రివాల్వర్ రీటా అనే సినిమాలో నటించింది. నవంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కీర్తి సురేష్‌ గత రెండు వారాలుగా మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

కీర్తి సురేష్‌ రివాల్వర్‌ రీటాగా...

తాజాగా 'రివాల్వర్‌ రీటా' సినిమా తెలుగు వర్షన్‌ ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఒక ప్రెస్‌ మీట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాపై అంచనాలు పెంచే విధంగా నటీనటులు మాట్లాడారు. ప్రముఖ నటుడు అజయ్‌ ఘోష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆయన ఈ సినిమాలో నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా కీర్తి సురేష్‌ తో వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి అజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె గొప్ప నటి అని చెప్పడంతో పాటు, చాలా మంచి మనిషి అని, అలాంటి హీరోయిన్ ను తెలుగు ఇండస్ట్రీలో చాలా అరుదుగా చూస్తూ ఉంటామని అన్నాడు. కీర్తి సురేష్ ప్రతి ఒక్కరితోనూ చాలా సన్నిహితంగా ఉంటూ, అందరితోనూ కలిసి పోతుందని అంటారు.

కీర్తి సురేష్‌ గురించి అజయ్‌ ఘోష్‌...

అజయ్‌ ఘోష్ ఇంకా మాట్లాడుతూ... తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు సమంత గారు ఆ తర్వాత కీర్తి సురేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వీరిద్దరే నాకు ఇండస్ట్రీలో ఎక్కువ ఇష్టం. ఈ అమ్మాయితో కలిసి చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కొంత మంది హీరోయిన్స్ ఉంటారు, పేర్లు చెప్పడం ఎందుకు లేగాని, పోయి అమ్మా నమస్కారం అంటే, హా అని అంటారు తప్ప, కనీసం మాట్లాడరు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఎంత పద్దతిగా అంటే, షూటింగ్‌ చివరి రోజు ఫైట్‌ అయింది అంతా పూర్తి అనుకుంటూ ఉండగా, ఈ అమ్మాయి పిలిచి మరీ ఫోటోలు దిగుతుంది. సర్‌ రండీ అంటూ నన్ను పిలిచి నాతో ఫోటో దిగింది. మన ఇంట్లో పిల్లల మాదిరిగా ఎంత చక్కగా ఉంది అనుకున్నాను. యాక్షన్‌ సీన్స్ విషయానికి వస్తే ఈమె గురించి చెప్పే పని లేదు, మీరు సినిమాలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

సమంత చేతుల మీదుగా

జెకె. చంద్రు దర్శకత్వంలో సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సీన్ రోల్డాన్ సంగీతాన్ని అందించాడు. కీర్తి సురేష్‌తో పాటు ఈ సినిమాలో రాధిక శరత్‌ కుమార్‌, సునీల్‌, జాన్ విజయ్‌, అజయ్‌ ఘోష్‌, కళ్యాణ్‌ మాస్టర్‌ తో పాటు ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. రెండేళ్ల క్రితం ఈ సినిమా యొక్క ఫస్ట్‌ లుక్‌ను స్టార్‌ హీరోయిన్‌ సమంత రివీల్‌ చేయడం జరిగింది. అప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. మధ్యలో కీర్తి సురేష్ పెళ్లి ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఆలస్యం అయినా తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. తమిళ్‌ భాషలో రూపొందిన ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర సౌత్‌ భాషల్లోనూ రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ వ్యక్తం అవుతోంది.




Tags:    

Similar News