హిట్టు లేని బాలీవుడ్‌కి ప్రత్యామ్నాయం ఇతడేనా?
బాలీవుడ్ లో ఖాన్ ల త్రయానికి ప్రత్యామ్నాయంగా ఉన్న హీరోల్లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లు అసాధారణ స్టార్ డమ్ ని కలిగి ఉన్నారు.;
బాలీవుడ్ లో ఖాన్ ల త్రయానికి ప్రత్యామ్నాయంగా ఉన్న హీరోల్లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్లు అసాధారణ స్టార్ డమ్ ని కలిగి ఉన్నారు. కానీ కొన్నేళ్లుగా హృతిక్ సరిగా సినిమాల్లో నటించడం లేదు. అతడికి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలున్నాయి. అక్షయ్ కుమార్ నటిస్తున్నా సరైన హిట్లు రావడం లేదు. ఇటీవలే అక్షయ్ కేసరి 2 లో నటించినా, ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు మినహా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత పెద్ద హిట్టు దక్కలేదు.
ఇదిలా ఉండగానే కరోనా క్రైసిస్ అనంతర కాలంలో బాగా రాణించిన హీరోగా అజయ్ దేవగన్ పేరు వినబడుతోంది. బాలీవుడ్ విజయాల్లేక డీలా పడిన సమయంలో అతడు మెస్సయ్యలా మారి హిట్లు ఇస్తున్నాడు. దేవగన్ నిశ్వబ్ధంగా కొన్ని విజయాల్ని బ్యాక్ టు బ్యాక్ అందుకున్నాడు. దృశ్యం 2, సైతాన్, సింగం ఎగైన్, రైడ్ 2 లాంటి వరుస చిత్రాలతో దేవగన్ సైలెంట్ గా హిట్లు కొట్టాడు. దృశ్యం 2, సైతాన్ బంపర్ హిట్లు. వీటికి క్రిటికల్ గాను ప్రశంసలు దక్కాయి. సింగం ఎగైన్ యావరేజ్ గా ఆడింది. కానీ `రైడ్ 2` సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇదే హుషారులో దేవగన్ నుంచి మరో మూడు సినిమాలు విడుదలకు వస్తున్నాయి. సన్ ఆఫ్ సర్దార్ 2, దే దే ప్యార్ దే 2 , టోటల్ ధమాల్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇవన్నీ సీక్వల్ కథలతో రూపొందుతున్న సినిమాలు. అప్పటికే విజయం సాధించిన ఫ్రాంఛైజీలో కొనసాగింపు భాగాలతో పాజిటివ్ రిజల్ట్ వస్తుందన్న నమ్మకం అతడికి ఉంది. అందువల్ల దేవగన్ ఇప్పుడున్న బాలీవుడ్ హీరోల్లో ఈ సీజన్ కి బెస్ట్ హీరోగా ఇండస్ట్రీని ఏల్తున్నాడని చెప్పాలి.
హిందీ చిత్రసీమలో ఖాన్ లకు ఎంత పెద్ద స్టార్ డమ్ ఉన్నా దేవగన్ లాంటి మరో ప్రత్యామ్నాయం తయారవ్వడం వెనక చాలా హార్డ్ వర్క్, సెలెక్షన్, నమ్మకం దాగి ఉన్నాయి. మంచి స్క్రిప్టుల ఎంపికతో దేవగన్ తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపిస్తున్నాడు. తన భర్త ఉత్తమమైన ఫేజ్ లో ఉండగానే కాజోల్ తన కెరీర్ ని రీషేప్ చేసేందుకు ప్రయత్నించడం ఆసక్తికరం. ఇక దేవగన్ ఫ్యామిలీ నుంచి అమన్ దేవగన్ హీరో అయ్యాడు. కుమార్తె నైసా దేవగన్‌ను కూడా అజయ్- కాజోల్ దంపతులు కథానాయికగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.