మొన్న అజయ్.. నిన్న సంజయ్.. ఏం జరుగుతోంది?

మొన్న అజయ్ దేవగన్.. నిన్న సంజయ్ దత్.. తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ స్టార్ల కదలికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.;

Update: 2026-03-25 06:28 GMT

మొన్న అజయ్ దేవగన్.. నిన్న సంజయ్ దత్.. తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ స్టార్ల కదలికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఆ ఇద్దరు ప్రముఖ నటులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. దీంతో సినీ ఇండస్ట్రీలో ఏదైనా పెద్ద మార్పు జరుగుతుందా? అన్న సందేహాలు సినీ ప్రియుల్లో నెలకొన్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అజయ్ దేవగన్ ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నట్లు ఆయన వెల్లడించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రపంచ స్థాయి చలనచిత్ర స్టూడియో ఏర్పాటు అంశంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, స్టూడియో నిర్మాణానికి ముందు మల్టీప్లెక్స్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని అజయ్ యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌ లో మల్టీప్లెక్స్ ప్రారంభిస్తానరి టాక్.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహా చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సంజయ్ దత్ ఇటీవల సమావేశమయ్యారు. ఆ భేటీ సచివాలయంలోని సీఎం ఛాంబర్‌ లో రీసెంట్ గా జరిగింది. సంజయ్ దత్‌ తో పాటు ఆయన బృందంలోని గౌరవ్ దూబే, కునాల్ పటేల్, అనుజ్ కుమార్ వంటి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో భారీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని సంజయ్ కు సీఎం వివరించారట. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనను వెల్లడించారు. అలాగే విశాఖపట్నం వంటి నగరాల్లో బాలీవుడ్ సినిమాల షూటింగ్‌ కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ద్వారా చిత్ర నిర్మాణానికి అవసరమైన అనుమతులు త్వరగా అందించే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీ వంటి అంశాలపై సంజయ్ దత్ బృందం ఆసక్తిగా వివరాలు తెలుసుకుంది. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అనుభవం ఉన్న సంజయ్ దత్, తన బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియోలు లేదా పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సర్కార్ కూడా పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం చెప్పారట. ఏదేమైనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ సినీ ఇండస్ట్రీకి కేంద్రంగా నిలిచిన నేపథ్యంలో, మరింత విస్తరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఆ ప్లాన్స్ అన్నీ ఎప్పుడు.. ఎంత మేరకు అమలు అవుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News