నటవారసులకు బిగ్ షాకిచ్చిన డెబ్యూ హీరో
టాలీవుడ్ బాలీవుడ్ లో చాలా మంది నటవారసులు పరిచయమవుతున్నారు. కానీ వీళ్లలో ప్రేక్షకాదరణ పొందేంత క్రేజ్ ఎవరికీ రావడం లేదు.;
టాలీవుడ్ బాలీవుడ్ లో చాలా మంది నటవారసులు పరిచయమవుతున్నారు. కానీ వీళ్లలో ప్రేక్షకాదరణ పొందేంత క్రేజ్ ఎవరికీ రావడం లేదు. ఇటీవలి కాలంలో సైఫ్ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీఖాన్, అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్, అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ .. వీళ్లంతా డెబ్యూ సినిమాలతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పైగా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొన్నారు. పలువురు డెబ్యూ కథానాయికలు కూడా నటులుగా తేలిపోయారు.
అంతకుముందు టాలీవుడ్ లో కూడా పలువురు నటవారసులు పూర్తిగా ఫ్లాపుల్ని ఎదుర్కొన్నారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు నటవారసత్వంతో సంబంధం లేకుండా ఒక కుర్రాడు హిందీ చిత్రసీమలో సంచలనం సృష్టిస్తున్నాడు. అతడి పేరు అహాన్ పాండే. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అలనా పాండే సోదరుడు. అనన్య పాండేకు కజిన్ వరుస. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన మ్యూజికల్ లవ్ స్టోరీ `సైయారా` చిత్రంతో అహాన్ పాండే- అనీత్ పద్దాల బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసారు.
ఈ సినిమాకి టీజర్ ట్రైలర్ దశ నుంచి క్రేజ్ ఏర్పడింది. ఈ శుక్రవారం సినిమా విడుదలై భారీ ఓపెనింగులు సాధించింది. అభిమానులు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రం మొదటి రోజు రూ.18 కోట్లకు పైగా నెట్ వసూలు చేస్తోందని ట్రేడ్ చెబుతోంది. ఇప్పటివరకూ 2025లో మూడవ అత్యధిక ప్రీ- టికెట్ సేల్స్ చేసిన మూవీగా రికార్డుల్లో నిలిచింది. చావా -సికందర్ మాత్రమే దీనిని అధిగమించాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మించిన `సయారా` రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది.
సాక్ నిల్క్ అప్‌డేట్ ప్రకారం..అహాన్-అనీత్ నటించిన `సైయారా` ఇప్పటికే రూ. 10 కోట్ల మార్కును దాటింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దేశీయంగా రూ. 14.07 కోట్లు వసూలు చేసింది. ఇది అనన్య తొలి చిత్రం `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` ప్రారంభ రోజు వసూళ్ల (3.5 కోట్లు)ను అధిగమించడమే గాక, జాన్వీ- ఇషాన్ ఖట్టర్ నటించిన `ధడక్` రికార్డును కూడా అధిగమించింది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందించిన ధడక్ తొలి రోజున దాదాపు రూ.8.71 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఇటీవలి కాలంలో అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ వంటి స్టార్లు నటించిన సినిమా కూడా ఇంత పెద్ద మొత్తం వసూలు చేయలేదని టాక్ వినిపిస్తోంది. అమీర్ ఖాన్ సీతారే జమీన్ పార్ కేవలం 3.5 కోట్లతో మొదలైంది. అందుకే ఇదంతా మోహిత్ సూరి మాయాజాలం అని అనుకోవాలి. టీనేజీ ప్రేమకథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనడానికి ఈ చిత్రం ఓపెనింగులే నిదర్శనం.