అడివి శేష్ సినిమాలకు పోస్టర్ల ఖర్చు రాలేదా?
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు.;
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. `మేజర్` సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకుని నార్త్‌లోనూ సత్తా చాటారు. రీసెంట్‌గా `డెకాయిట్ ఓ లవ్ స్టోరీ`తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ప్రముఖుల ప్రశంసల్ని సైతం సొంతం చేసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. అయితే తను గత కొంత కాలంగా వరుస విజయాల్ని దక్కించుకోవడానికి ఓ బలమైన కారణం ఉందని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
కెరీర్ ప్రారంభంలో అడివి శేష్ వరుస ఫ్లాపుల్ని, డిజాస్టర్లని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా అడివి శేష్ వెల్లడించి తనలో వచ్చిన మార్పులని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలోకి ప్రవేశించిన తొలి నాళ్లలో తాను ఎదుర్కొన్న వైఫల్యాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని తనని తాను ఎలా మార్చుకున్నాడన్నది స్పష్టం చేశారు. పోస్టర్ ఖర్చులు కూడా తిరిగి రాని గడ్డు పరిస్థితులను ఎదుర్కోన్నానని తెలిపారు. ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాతల ఆర్థిక ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకునే నిర్మాతల నటుడిగా మారేలా చేశాయట.
ఈ సందర్భంగా సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. వీరి నుంచి అడివి శేష్ ఎన్నో మెలకువలు, పాఠాలు నేర్చుకున్నారట. వర్మ రూపొందించిన `సత్య` మూవీలోని `భీకూ మాత్రే` పరిచయ సన్నివేశం తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. ఒక గ్యాంగ్‌స్టర్ తన కుటుంబంతో వ్యాపార వ్యవహారాలను ఎంత సాధారణంగా నిర్వహిస్తాడో ఒకే ఒక్క షాట్‌లో చూపించిన తీరు ఏ పుస్తకాల్లో దొరకని వర్మ మ్యాజిక్` అన్నారు.
హీరోగా, రైటర్‌గా మల్టీటాలెంట్‌ని ప్రదర్శించడం వెనకున్న రహస్యాన్ని కూడా ఈ సందర్భంగా ఓపెన్ చేశారు శేష్. తనని తాను ఓ నటుడిగా నిలబెట్టుకోవడానికి ఈ మల్టీ టాస్కింగ్ తప్పదని భావించాడట. `మేజర్` సినిమా విషయంలో అదే ఫాలో అయ్యానని, అలా చేయడం తనకు బాగా ప్లస్ అయిందని, దాంతో నిర్మాతలు తనని నమ్మడం మొదలు పెట్టారని చెప్పుకొచ్చారు. సినిమా నిర్మాణంలో `మేజర్` తనకు లగ్జరీ లభించిందని, తన సృజనాత్మకతను తగ్గిస్తుందన్న కారణంతో పబ్లిసిటీ, పీఆర్ స్టంట్‌లపై ఆధారపడలేదన్నారు.
ఒక నటుడిగా నిర్మాతలకు లాభాల్ని తెచ్చి పెట్టడమే తనకు అత్యంత ముఖ్యమని, మేజర్ సినిమా వారం రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద, ఓటీటీ రైట్స్ పరంగా రూ.65 కోట్ల వరకు రాబట్టి నిర్మాతలకు లాభాల్ని అందించిందన్నారు. ఒక సినిమా నిర్మాణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని, ప్రతి రోజు నిర్మాణ వ్యయం ఎంత అవుతుందో తెలుసుకుంటూ ఉంటానని, దానికి అనుగుణంగా కేర్ తీసుకుంటూ ఖర్చుని అదుపు చేస్తుంటానని తెలిపారు. అడివి శేష్ అలా తను చేసే ప్రతి సినిమాని తన సినిమాగా భావించి బడ్జెట్, వర్కింగ్ డేస్ విషయంలో డైరెక్టర్‌ని మించి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాబట్టే తనతో సినిమాలు చేయాలని నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఇదే ఫార్ములాని అడివి శేష్ ఫాలో అయితే హీరోగా తనకు తిరుగే ఉండదు.