డెకాయిట్: ఓపెనింగ్స్ కు ఈ బజ్ సరిపోతుందా?
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.;
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ మరోసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శేష్, ఇప్పుడు యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ డెకాయిట్ తో ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
సినిమాలో శేష్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు-నటుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ను తీసుకువచ్చింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ సహజంగా ఉండటం, హాలీవుడ్ తరహా ట్రీట్మెంట్ కనిపించడం విశేషం. డార్క్ టోన్ కు తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండటం, ప్రతి సన్నివేశాన్ని మరింత ఎఫెక్టివ్ గా మార్చింది. విజువల్స్ కూడా స్టైలిష్ గా, ఇంటెన్స్ గా ఉండటంతో సినిమా క్వాలిటీపై మంచి ఇంప్రెషన్ ఏర్పడింది.
డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ లభించింది. ఇప్పటివరకు 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఆ బజ్ ఓపెనింగ్స్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు అడవి శేష్ నటించిన చిత్రాలు మెయిన్ గా పాజిటివ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద క్రమంగా కలెక్షన్స్ పెంచుకున్నాయి.
కానీ డెకాయిట్ మాత్రం ఆయన కెరీర్ లో హై బడ్జెట్ చిత్రంగా తెరకెక్కినట్లు సమాచారం. దీంతో సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనుండడంతో ప్రారంభ వసూళ్లు కీలకంగా మారనున్నాయి. అయితే మేజర్ విజయంతో శేష్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అదే స్థాయిలో డెకాయిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
ఇక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఎస్‌ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఆ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. సాంకేతిక విభాగంలో ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్ బాధ్యతలు కోదాటి పవన్ కళ్యాణ్ నిర్వహించారు. మొత్తానికి ట్రైలర్ తో అంచనాలు పెంచిన డెకాయిట్ సినిమా.. విడుదల తర్వాత కూడా అదే రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందా? ఓపెనింగ్స్ కు ఆ బజ్ సరిపోతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులపాటు వేచి చూడాల్సిందే.