ఆదిత్యధర్‌ని నమ్మించి మోసం చేశారా?
మిల్కా సింగ్ అటోబయోగ్రఫీ నుంచి స్ఫూర్తి పొంది తీసిన కథ అని టైటిల్స్‌లో వేశారు. కానీ ఎక్కడా ధర్ కు క్రెడిట్ ఇవ్వలేదు.;
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్ 2`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియా వండర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే రికార్డులని తిరగరాయడం మొదలు పెట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు పలు రికార్డుల్ని అధిగమించి సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1791 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డుకు చేరువ అవుతోంది.
జియో పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఒక్కసారిగా దర్శకుడు ఆదిత్యధర్ వార్తల్లో నిలుస్లున్నాడు. టెర్రిరిస్టులని, డెకాయిట్‌లని అడ్డం పెట్టుకుని ఇండియాపై పాకిస్థాన్ చేసిన దురాగతాలని, దాని వెనక జరిగిన భారీ కుట్రలని, ఆ కుట్రలకు సహకరించిన ఇండియన్ పొలిటీషియన్స్‌ని ప్రపంచానికి చాటిచెప్పడంతో `ధురంధర్ 2` హాట్ టాపిక్‌గా మారింది. అదే స్థాయిలో దర్శకుడు ఆదిత్యధర్ కూడా చర్చనీయాంశంగా మారాడు.
ఇంతకీ ఇతను ఎవరు? ఇతనకి ఇంత డేర్ ఏంటీ? ఎవరూ చేయడానికి సాహసించని కథలని ఎంచుకుంటున్నాడేంటీ? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే అతనికి సంబంధించిన ఒక్కే విషయం తాజాగా బయటపడుతున్నాయి. కశ్మీరీ పండిట్ అయినటువంటి ఆదిత్యధర్ కశ్మీర్‌లో జరిగిన నరమేధం కారణంగా అతని కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. అక్కడి నుంచి సినిమాల్లోకి ప్రవేశించిన ఆదిత్యధర్ మొదట ప్రియదర్శన్ వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయగ..ఆ తరువాత రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా వద్ద వర్క్ చేశాడట.
2009లో రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా `ఢిల్లీ 6` మూవీ చేస్తున్నాడట. ఆ టైమ్‌లో ఆదిత్యధర్‌కు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా మంచి స్టోరీ రెడీ చేసుకోమని, డైరెక్టర్‌గా అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశారట. తను చెప్పినట్టే స్పోర్ట్స్ నేపథ్యంలో మిల్కాసింగ్ స్టోరీని సిద్ధం చేసి ఆ స్క్రిప్ట్‌ని ఆయనకు అప్పగించాడట ఆదిత్యధర్. అయితే ఆ తరువాతే పరిస్థితి మొత్తం మారిపోయిందట. ఆ స్టోరీని రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా పేరు మీద రిజిస్టర్ చేయడంతో ఆదిత్యధర్ ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో ఇచ్చిన మాటని పక్కన పెట్టిన రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా..ఆదిత్యధర్‌ని పక్కన పెట్టి ఆ స్టోరీని తానే డైరెక్ట్ చేశాడు.
మిల్కా సింగ్ అటోబయోగ్రఫీ నుంచి స్ఫూర్తి పొంది తీసిన కథ అని టైటిల్స్‌లో వేశారు. కానీ ఎక్కడా ధర్ కు క్రెడిట్ ఇవ్వలేదు. సినిమా కల్ట్ క్లాసిక్ హిట్ అయింది. అయినా సరే ఆదిత్యధర్ దీని గురించి ఎక్కడా పెదవి విప్పలేదు. సైలెంట్‌గా తన టైమ్ వచ్చే వరకు ఎదురు చూస్తూ వచ్చాడట. ఆ కోపంతోనే ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్, ఇప్పుడు `ధురంధర్, ధురంధర్ 2`లని తెరకెక్కించాడని, గత కొంత కాలంగా తన కథలు చౌర్యానికి గురైనా పట్టించుకోకుండా `ధురంధర్`తో తనేంటో నిరూపించాడని బాలీవుడ్‌లో కామెంట్‌లు వినిపిస్తున్నాయి.