46 కోట్లు కొట్టేయాల‌ని చూసారు.. సోద‌రి అంబిక‌, సోద‌రుడిపైనా న‌టి రాధ ఫిర్యాదు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటి రాధ కుటుంబంలో ఊహించని వివాదం చోటుచేసుకుంది.

Update: 2026-09-21 13:26 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నటి రాధ కుటుంబంలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. తన స్వయానా సోదరి, నటి అంబికా నాయర్ .. సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌లపై (అర్జున్ నాయర్) రాధ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. తన గదిలోకి అనధికారికంగా ప్రవేశించి సంతకం చేసిన ఖాళీ చెక్కులను దొంగిలించి భారీ మొత్తంలో డబ్బు డ్రా చేయడానికి ప్రయత్నించారంటూ రాధ‌ తీవ్ర ఆరోపణలు చేసారు.

చెన్నైలోని వలసవాక్కం, ఏఆర్ స్ట్రీట్‌లోని ఒక ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తున్న రాధ.. వ్యాపార అవసరాలు, సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లులు, పన్ను చెల్లింపుల నిమిత్తం తన గదిలో ఐదారు సంతకం చేసిన ఖాళీ చెక్కులను ఉంచేవారు. వృత్తిగత, వ్యక్తిగత పనుల నిమిత్తం రాధ‌ తరచూ కేరళ, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. ఇదే అదనుగా అదే ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించే అంబికా నాయర్‌కు తన గదిలోకి ప్రవేశం ఉండటంతో ఈ అక్రమాలకు పాల్పడ్డారని రాధ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోరుర్‌లోని ఆర్.ఆర్. గార్డెన్ (గతంలో ఏఆర్ఎస్ గార్డెన్ స్టూడియో) వ్యాపార నిర్వహణకు సంబంధించిన ఈ వివాదంలో పాత చెక్కులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 2025 జనవరి 7న ఆ వ్యాపార సంస్థ‌ పేరు మారింద‌ని... ఐడీబీఐ బ్యాంకు పోరూర్ బ్రాంచ్‌కు ఈ విషయం తెలిపి జనవరి 22 నుండి కొత్త చెక్‌బుక్‌ను వాడుకలోకి తెచ్చినట్లు రాధ తెలిపారు. దీంతో పాత చెక్కులు చెల్లవని స్పష్టమైనా ఆ పాత చెక్కులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు.

17 సెప్టెంబర్ 2026 న అంబికా నాయర్ పేరుతో భారీ లావాదేవీల కోసం చెక్కులు ప్రెజెంట్ అయినట్లు ఐడీబీఐ బ్యాంకు నుండి రాధకు ఇమెయిల్ వచ్చింది. రూ. 11 లక్షలు, రూ. 13.17 కోట్లు, రూ. 27.73 కోట్లు, రూ. 7 కోట్లు .. రూ. 1.79 కోట్ల విలువైన ఐదు చెక్కుల ద్వారా మొత్తం రూ. 50.8 కోట్ల వరకు డ్రా చేయడానికి ప్రయత్నించినట్లు తేలింది. వెంటనే రాధ‌ అప్రమత్తమై బ్యాంకును సంప్రదించి ఆ లావాదేవీలను నిలిపివేయాలని కోరారు. చెక్కులపై పేరు, మొత్తం, తేదీలను తన సోదరుడు అర్జున్ నాయర్ రాశాడని ఆమె ఆరోపించారు.

తన సోదరుడు అర్జున్ నాయర్ ఫెమా (FEMA) చట్టం కింద క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్నారని.. మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం భారీ జరిమానా చెల్లించే ఒత్తిడిలో ఉన్నారని రాధ తన ఫిర్యాదులో వెల్లడించారు. తమ మధ్య ఎలాంటి చట్టబద్ధమైన రుణ బాధ్యత లేకపోయినా.. తన గదిలో ఉన్న బంగారం, డైమండ్ ఆభరణాలు, ఆస్తి పత్రాలను చూసుకోకుండా అడ్డుకుంటూ సోదరీసోదరులు ఈ మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాధ పోలీసులను కోరారు.

Tags:    

Similar News