ట్రోలర్స్ కి నటి హేమ గట్టి ఝలక్.. సజ్జనార్ కి కంప్లైంట్!
ముఖ్యంగా ఆ కేసు కారణంగా తన ఇమేజ్ కి భారీగా నష్టం జరిగిందని అప్పట్లో సినీవర్గాలు కూడా భావించాయి. అంతేకాదు మా సభ్యత్వం కూడా కొద్ది రోజులు తొలగించిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్న నటి హేమ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గత ఏడాది సంచలనం సృష్టించిన బెంగళూరు రేవు పార్టీ కేసులో ఆమె పేరు వినిపించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆ కేసు కారణంగా తన ఇమేజ్ కి భారీగా నష్టం జరిగిందని అప్పట్లో సినీవర్గాలు కూడా భావించాయి. అంతేకాదు మా సభ్యత్వం కూడా కొద్ది రోజులు తొలగించిన విషయం తెలిసిందే.
నిజాయితీని నిరూపించుకున్నా ఆగని ట్రోల్స్..
అయితే తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఎంతో శ్రమించింది నటి హేమ. పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగటివ్ రావడంతో కర్ణాటక హైకోర్టు హేమాపై నమోదైన కేసును కొట్టివేసింది. ఇక దీంతో చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. అయితే ఆమెపై కొంతమంది ట్రోలర్స్ ఎప్పటిలాగే మళ్లీ టార్గెట్ చేశారు. అలాంటి వారికి ఆమె సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా సరే వారి ధోరణి మార్చుకోకపోవడంతో ఏకంగా పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలసి తనపై ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఒక వినతి పత్రాన్ని కూడా అందించింది.
సజ్జనార్ కు కంప్లైంట్ ఇచ్చిన హేమ..
ఈ మేరకు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి గట్టి ఝలక్ ఇచ్చింది నటి హేమ. తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.. "నాపై వల్గర్ కామెంట్స్ పెట్టొద్దని, అలా చేస్తే లీగల్ గా చర్యలు తీసుకుంటానని ముందే హెచ్చరించాను. అయినా కొంతమంది అసభ్యంగా కామెంట్లు పెట్టారు. దీంతో నా గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ స్క్రీన్ షాట్లతో పోలీస్ కమిషనర్ సజ్జనార్ కి కంప్లైంట్ ఇచ్చాను" అంటూ నటి హేమ తెలిపారు. ఇక ప్రస్తుతం నటి హేమ రిలీజ్ చేసిన ఈ వీడియో.. అటు సజ్జనార్ కి ఇచ్చిన కంప్లైంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇప్పటికైనా హేమాను టార్గెట్ చేసుకొని ట్రోల్స్ చేస్తున్న వారిలో మార్పు వస్తుందేమో చూడాలి.
సీరియస్ వార్నింగ్ ఇచ్చినా మారని వైనం..
డ్రగ్స్ కేసులో నెగిటివ్ వచ్చినా సరే తన పేరును బ్యాడ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా గత నాలుగు రోజుల క్రితం ఒక వీడియోని విడుదల చేస్తూ తన మనసులోని భావాలను పంచుకుంది హేమ. హైకోర్టు నా కేసును కొట్టివేసింది. ముఖ్యంగా నాపై ఉన్న ఆరోపణలన్నీ ఆధారాలు లేవని తెలిపింది. యూరిన్ టెస్ట్ లు కూడా నెగిటివ్ వచ్చాయి . ఈ విషయాన్ని కూడా నేను ప్రజలకు చెప్పాను. నేను కేవలం ఆ పార్టీకి ఆహ్వానం రావడంతోనే వెళ్లాను. అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. మొదట్నుంచి నేను ఇదే విషయం చెబుతున్నాను. నేను తప్పు చేయలేదని కోర్టు చెప్పింది. అయినా కొంతమంది ఇప్పటికీ రేవు పార్టీలు, డ్రగ్స్ అంటూ నాపై పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నారు.
ఫేక్ అకౌంట్లను గుర్తించడం పెద్ద పనేం కాదు - నటి హేమ
ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కొని ఎవరైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నారు కానీ టెక్నాలజీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. అలాంటి అకౌంట్లను గుర్తించడం పెద్ద విషయం ఏమి కాదు. నాపై ఎవరైనా తప్పుడు కథనాలు సృష్టిస్తే చర్య తప్పదు" అంటూ హెచ్చరించింది. అయినా సరే ట్రోలర్స్ తమ తీరును మార్చుకోకపోవడంతో ఆమె ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.