అవన్నీ పుకార్లు మాత్రమే!
మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో సమానంగా హీరోగా సినీపరిశ్రమలో అడుగుపెట్టాడు సుధాకర్.;
మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో సమానంగా హీరోగా సినీపరిశ్రమలో అడుగుపెట్టాడు సుధాకర్. కెరీర్ ఆరంభం తెలుగు, తమిళంలో హీరోగా నటించారు. కానీ కాలక్రమంలో అతడు సహాయనటుడిగా స్థిరపడ్డారు. తన సహచర నటులంతా పెద్ద హీరోలుగా ఎదిగినా సుధాకర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోవడానికి రకరకాల కారణాలున్నాయి. ఆయన హీరోగా కొనసాగకపోయినా, టాలీవుడ్ అగ్ర హీరోలందరి సినిమాల్లో అద్భుతమైన కామెడీ పాత్రలతో అలరించారు.
అయితే సీనియర్ నటుడు సుధాకర్ 60 ప్లస్ వయసులో ఉన్నప్పుడు అనారోగ్యంతో మూడ నాలుగు నెలలు పైగా కోమాలోకి వెళ్లిపోయారని, ఆల్కహాల్ అడిక్షన్ తో తీవ్రమైన పరిస్థితి తలెత్తిందని మీడియాలో కథనాలొచ్చాయి. ఆర్థికంగాను సుధాకర్ కుటుంబం బాగా చితికిపోయిందని కూడా ప్రచారమైంది. అయితే తాజా ఇంటర్వ్యూలో సుధాకర్, ఆయన కుమారుడు బెన్నీ మాట్లాడుతూ.. తన తండ్రి 30రోజుల పాటు కోమాలో ఉన్నారని తెలిపారు. అలాగే ఆర్థికంగా ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నా.. తమకు ఎప్పుడూ హీన దశ లేదని క్లారిటీ ఇచ్చారు.
చెన్నైలో 600-700 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయని వార్తలొచ్చాయి కదా? అని ప్రశ్నించగా అవన్నీ పుకార్లు మాత్రమేనని వివరణ ఇచ్చారు. కెరీర్ ఉత్తమ దశలో ఒక సినిమాకి ఎంత పారితోషికం అందుకున్నారు? అని సుధాకర్ ని ప్రశ్నించగా, తాను కెరీర్ ఆరంభం తమిళంలో హీరోగా నటించినప్పుడు 30,000 పారితోషికం అందుకున్నానని సుధాకర్ వెల్లడించారు. అయితే టాలీవుడ్ లో సహాయ నటుడిగా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు మాత్రం సుధాకర్ రోజుకు లక్షల్లో పారితోషికాలు అందుకున్నారని కథనాలొచ్చాయి. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటులతో పోటీపడుతూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇటీవల సుధాకర్ అన్ని అనారోగ్యాల నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని కుమారుడు బెన్ని వెల్లడించాడు. బెన్నీ అచ్చు గుద్దినట్టు తన తండ్రిని పోలి ఉండడం ఆసక్తిని కలిగిస్తోంది. అతడు కూడా సినీరంగంలో నటుడిగా ఆరంగేట్రం చేస్తారని సుధాకర్ వెల్లడించాడు. సుధాకర్ తాను ప్రస్తుతం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నానని, ప్రతి ఆదివారం చర్చికి వెళతానని కూడా తెలిపారు.