ఇదే నా ఆవేదన.. అందుకే అలా మాట్లాడాను: శివాజీ
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటుడు శివాజీ స్పందించారు.;
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటుడు శివాజీ స్పందించారు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు జరిగిన సంఘటనపై క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు స్టేజి మీద మాట్లాడేటప్పుడు తన నోటి నుంచి వచ్చిన రెండు అన్ పార్లమెంటరీ పదాలకు బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించారు. తన 30 ఏళ్ల కెరీర్ లో, రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలా హద్దు దాటి మాట్లాడలేదని, ఆ రోజు అలా జరగడం తనను కూడా బాధించిందని అన్నారు.
ఆ రెండు పదాలు వాడటం తప్పు అని ఒప్పుకుంటూనే, అసలు ఆ ఆవేదన రావడానికి గల బలమైన కారణాన్ని శివాజీ బయటపెట్టారు. లులు మాల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కు జరిగిన చేదు అనుభవమే తనను డిస్టర్బ్ చేసిందని చెప్పారు. ఆ రద్దీలో ఆమె పడ్డ ఇబ్బంది, కారులోకి వెళ్ళాక ఆమె మొహంలో కనిపించిన ఆందోళన తన మనసులో నుంచి వారం రోజుల పాటు పోలేదని, అదే తన కోపానికి కారణమని వివరించారు.
నిధి అగర్వాల్ సంఘటనతో పాటు ఇటీవల సమంత విషయంలో జరిగిన ఇన్సిడెంట్ కూడా తనను ఆలోచింపజేసిందని శివాజీ పేర్కొన్నారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రమ్యకృష్ణ, జయసుధ, విజయశాంతి వంటి వారు చీరకట్టులో, పద్ధతిగా ఉంటూ ఎంతో గౌరవం పొందేవారని గుర్తుచేశారు. అప్పట్లో 90 శాతం మంది ఆర్టిస్టులు అలాగే ఉండేవారని, వారిని చూసి జనం గౌరవించేవారని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే తాను ఎవరినీ ఫలానా డ్రెస్ వేసుకోండి, కప్పుకోండి అని చెప్పడం లేదని శివాజీ క్లారిటీ ఇచ్చారు. ఎవరి ఇష్టం వారిదని అంటూనే, సమాజంలో ఏ తప్పు జరిగినా దానికి సినిమాలే కారణం అని అంటుంటారని, ఆ నింద మన మీదకు ఎందుకు రావాలనేది తన పాయింట్ అని చెప్పారు. మన వస్త్రధారణ వల్ల ఇతరులకు విమర్శించే అవకాశం ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ మాటలు అన్నట్లు స్పష్టం చేశారు.
సినిమా వల్లనే సమాజం చెడిపోతుందనే మాటలు తరచూ వినాల్సి వస్తోందని, ఇక్కడే బతుకుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తనకు ఆ మాటలు బాధ కలిగిస్తాయని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మన ఇండస్ట్రీ పట్ల చిన్నచూపు రాకూడదనే తపనతోనే ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చిందే తప్ప, ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని వెల్లడించారు. చివరగా ఆ రోజు స్టేజ్ దిగిన వెంటనే తాను మాట్లాడిన విధానం తప్పు అని గ్రహించానని శివాజీ చెప్పుకొచ్చారు. అందుకే తన తోటి నటీమణులకు, ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని, ఆ పదాలు దొర్లినందుకు చింతిస్తున్నానని అన్నారు.