ఐశ్వ‌ర్యారాయ్ త‌ర్వాత అభిషేక్‌పై కోర్టు తీర్పు

ఇప్పుడు ఇదే త‌రహా తీర్పు అభిషేక్ బ‌చ్చ‌న్ కి వ‌ర్తింప జేసింది దిల్లీ హైకోర్టు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఢిల్లీ హైకోర్టు కాపాడింది;

Update: 2025-09-14 08:58 GMT

త‌న ఫోటోలు, వీడియోల‌ను అనుమ‌తి లేకుండా ఉప‌యోగించుకుంటున్న కొన్ని కంపెనీలు, వెబ్ సైట్ట‌పై ఐశ్వ‌ర్యారాయ్ కోర్టుకు ఎక్కిన సంగ‌తి తెలిసిందే. త‌న ఫోటోలు, వీడియోల‌ను అశ్లీల‌త‌ను చాటేలా మార్ఫింగ్ చేస్తున్నార‌ని, దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని కూడా త‌మ పిటిష‌న్ లో ఐశ్వ‌ర్యారాయ్ నివేదించారు. ఇంత‌కుముందే దీనిపై దిల్లీ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఐశ్వ‌ర్యారాయ్ కి అనుకూలంగా తీర్పు వెలువ‌డింది. అనుమ‌తి లేకుండా ఐష్ ఫోటోలు, వీడియోల‌ను ఉప‌యోగించుకుంటే అది నేరం. అశ్లీల కంటెంట్ ని కృత్రిమంగా తయారు చేసి ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించినా దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌ని కోర్టు తీర్పునిచ్చింది.

ఇప్పుడు ఇదే త‌రహా తీర్పు అభిషేక్ బ‌చ్చ‌న్ కి వ‌ర్తింప జేసింది దిల్లీ హైకోర్టు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఢిల్లీ హైకోర్టు కాపాడింది. వెబ్‌సైట్‌లు, యూట్యూబ్- ఆన్‌లైన్ డిజిట‌ల్ వేదిక‌లు అనుమతి లేకుండా వ్యాపార‌ లాభం కోసం త‌న‌ పేరును, చిత్రాలను చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా కోర్టు తీర్పు నిరోధించింది. అభిషేక్ కి అనుకూలంగా తీర్పు వెలువ‌డింది. బచ్చన్ పేరు, ఫోటోలు, అత‌డి సంతకం సహా దేనినీ దుర్వినియోగం చేయ‌కూడ‌ద‌ని, వెబ్‌సైట్‌లు, డిజిట‌ల్ వేదిక‌లు అతడి అనుమతి లేకుండా, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతిక సాధనాలను ఉపయోగించి దుర్వినియోగం చేస్తున్నాయని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది.

అన‌ధికారికంగా ఇలాంటి వాటికి పాల్ప‌డితే శిక్ష త‌ప్ప‌ద‌ని, దీనివ‌ల్ల స్టార్ పై ప్ర‌జ‌ల్లో ఉన్న స‌ద్భావ‌న పోతుంద‌ని, కీర్తి ప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం వాటిల్లుతుంద‌ని జస్టిస్ తేజస్ కరియా సెప్టెంబర్ 10 నాటి ఉత్తర్వులో పేర్కొన్నారు. ఢిల్లీ కోర్టు తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడంతో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు పెద్ద ఉపశమనం లభించిన అనంత‌రం అభిషేక్ కూడా అనుకూల తీర్పును పొంద‌డం ఆస‌క్తిక‌రం. ఐశ్వ‌ర్యారాయ్, అభిషేక్ ల‌పై అనుచిత‌మైన ఏఐలో త‌యారు చేసిన ఫోటోలు, వీడియోల‌ను, అశ్లీల‌మైన కంటెంట్ ని ప్ర‌మోష‌న్స్ కోసం ఉప‌యోగించ‌కూడ‌ద‌ని కోర్టు తీర్పు వెలువ‌రించింది. ఇక‌పై అలాంటి ఫోటోలు వీడియోల‌ను రూపొందించేవారిపై త‌క్ష‌ణం కోర్టు చ‌ర్య‌లు తీసుకుంటుంది.

Tags:    

Similar News