తీవ్ర అవమానం ఎదురైనా అగ్రహీరో మౌనం
అతడు పదే పదే తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. క్యారెక్టర్‌ని కించపరుస్తూ వంచనకు గురి చేస్తున్నాడు.;
అతడు పదే పదే తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. క్యారెక్టర్‌ని కించపరుస్తూ వంచనకు గురి చేస్తున్నాడు. కుటుంబ సభ్యులందరిపైనా బురద జల్లుతున్నాడు. వ్యక్తిగత కామెంట్లతో, దారుణ వ్యాఖ్యలతో జుగుప్స పుట్టిస్తున్నాడు. అతడిలో ఉన్న అక్కసు మొత్తం వెల్లగక్కుతున్నాడు. కక్షపూరిత స్వభావంతో ఎటాక్ చేస్తున్నాడు. కలిసి పని చేసింది ఒక సినిమా కోసమే అయినా స్టార్ హీరో కుటుంబం ఆ దర్శకుడికి అంతగా శత్రువులుగా మారిపోయారా?
సల్మాన్ ఖాన్ కుటుంబంపై దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు తప్పు పడుతున్నారు. తన కెరీర్ ఎదుగుదలను నియంత్రించాడని సల్మాన్‌పై తీవ్రంగా ఆరోపించిన అభినవ్, అతడిని అతడి సోదరులను కూడా తీవ్రంగా అవమానించాడు. ఆర్భాజ్ నుంచి విడిపోయిన మలైకా అరోరా గురించి అతడు ప్రస్థావించాడు.
సల్మాన్ అతడి కుటుంబీకులతో క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడమే గాక, తన పారితోషికం కూడా తనకు రాలేదని ఆవేదన చెందాడు. అయితే అతడి వ్యాఖ్యలు గౌరవం చెడకుండా సున్నితంగా ఉంటే బావుండేది. కానీ అతడు కటువుగా తన కోపాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
అయితే ఎవరైనా వ్యక్తులు ఆక్రోషాన్ని ఎలా ప్రదర్శించారు? అనేది చాలా ముఖ్యం. అభినవ్ కశ్యప్ ప్రవర్తనను, మాట్లాడే విధానాన్ని బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ తో పాటు, ఏక్తా కపూర్ కూడా తప్పు పట్టారు. అతడు అంత ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడే ఎందుకు కలిగింది. దబాంగ్ 2010లో విడుదలైంది. ఈ దశాబ్ధ కాలంగా అతడు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు ఇలా విమర్శిస్తున్నాడు? అంటూ నిలదీసారు. అభినవ్ తన అసంతృప్తిని లేదా తనకు ఎదురైన అన్యాయాన్ని సున్నితంగా అందరూ అర్థం చేసుకునేలా వివరించకుండా, తనను ఇతరులు తప్పు పట్టేలా కటువుగా, దారుణంగా వ్యవహరించడాన్ని అందరూ తప్పు పడుతున్నారు.