వాళ్లిద్దరు కలిసారని ఖాన్ త్రయం దిగుతోందా?
ఇండియన్ సినిమా పేట్రన్ పూర్తిగా మారింది. మల్టీస్టారర్ లు అంతకు మించి యూనివర్శ్ లు తెరకెక్కిస్తోన్న రోజులివి.;
ఇండియన్ సినిమా పేట్రన్ పూర్తిగా మారింది. మల్టీస్టారర్ లు అంతకు మించి యూనివర్శ్ లు తెరకెక్కిస్తోన్న రోజులివి. స్టార్ హీరోలంతా ఒకే వేదికపైకి వచ్చి పని చేస్తున్నారు. తమ ఇమేజ్ ని సైతం పక్కన బెట్టి కథ కోసం పని చేయడంపై దృష్టి పెడుతున్నారు. ఆ విషయంలో యూనివర్శ్ లు ఎంతో కీలకంగా మారుతున్నాయి. మరోవైపు టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ట్రెండ్ కూడా ఊపందుకోవడంతో? టాలీవుడ్ ని ఎదుర్కోవడం ఎలా అని కోలీవుడ్...బాలీవుడ్ పరిశ్రమలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ రెండు పరిశ్రమల హీరోలు టాలీవుడ్ కి వచ్చిన పని చేయాలని చెబుతున్నా. సొంత పరిశ్రమలో ఉండి మనమెందుకు ఇక్కడి నుంచే అలాంటి సినిమాలు చేయకూడదని బ్యాకెండ్ లో సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు.
అక్కడ ఆ లెజెండ్స్ ఇద్దరూ:
ఇప్పటికే నాలుగు దశాబ్దాల తర్వాత రజనీకాంత్-కమల్ హాసన్ మళ్లీ కలిసి నటించడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. మంచి కథ కుదిరితే మ్యాకప్ వేసుకోవడానికి తాము సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. మరి ఇదే తరహాలో బాలీవుడ్ లో ఖాన్ త్రయం కూడా సిద్దంగా ఉందా? అంటే అవుననే తెలుస్తోంది. బాలీవుడ్ కింగ్స్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి నటించడానికి రెడీగా ఉన్నారా? అంటే సన్నివేశం సానుకూలంగానే కనిపిస్తోంది.
రెడీ అంటూ అమీర్ ముందుకు:
ఇంత వరకూ ఈ ముగ్గురు కలిసి నటించింది లేదు. ఒకరి సినిమాల్లో ఒకరు అతిధిగానో..కీలక పాత్రల్లోనో కనిపించడం తప్ప కలిసి మల్టీస్టారర్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన కమల్ నహ్తా ఖాన్ గేమ్ ఛేంజర్స్ ఇంటర్వ్యూలో అమీర్ ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. మీరంతా మూడు దశాబ్దాలుగా ఒకే చిత్ర పరిశ్రమలో కలిసి పని చేస్తున్నారు. కానీ ఖాన్ త్రయం పూర్తి స్థాయి సినిమా మాత్రం చేయలేదనే ప్రశ్న తలెత్తగా? అందుకు అమీర్ బధులిస్తూ తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని..కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
సెట్ అవ్వడం వీజీ కాదే:
కానీ ఈ త్రయాన్ని కలపడం అంత సులభమా? ఇండియాలో ముగ్గురు పెద్ద స్టార్లు. ఒకర్ని మించి ఒకరు పోటీ పడుతుంటారు. బాలీవుడ్ లోనూ ముగ్గురి మధ్య చాలా కాలంగా పోటీ ఉంది. అలాంటి త్రయాన్ని ఒకే వేదికపై తీసుకొచ్చి సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. ముగ్గురు ఇమేజ్ కు తగ్గ కథ కుదరాలి. ఆ ముగ్గుర్ని హ్యాండిల్ చేయగలిగే దర్శకుడు సెట్ అవ్వాలి. కోట్లలో పారితోషికాలు చెల్లించే నిర్మాణ సంస్థ కావాలి. ఇవన్నీ సెట్ అయినప్పుడే ఖాన్ త్రయం చేతులు కలిపేది.