కూలీ క్యామియోపై అంచనాలను పెంచేసిన ఆమిర్
ఖైదీ, విక్రమ్, లియో ఇలా సినిమా సినిమాకీ తన రేంజ్ ను మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.;
ఖైదీ, విక్రమ్, లియో ఇలా సినిమా సినిమాకీ తన రేంజ్ ను మరింత పెంచుకుంటూ వెళ్తున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం లోకేష్, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కాకుండా స్టాండ్ ఎలోన్ ఫిల్మ్ గా లోకేష్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.
రజినీకాంత్ తో లోకేష్ చేస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. ఆ అంచనాలను ఇంకాస్త పెంచుతూ ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర కూడా భాగమయ్యారు. దీంతో కూలీ సినిమాకు విపరీతంగా హైప్ వచ్చింది. ఇది చాలదన్నట్టు కూలీలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తో కూడా లోకేష్ ఓ క్యామియో చేయించాడు. ఈ విషయాన్ని ఎవరూ అనౌన్స్ చేయకపోవడంతో ఇప్పటివరకు దీన్ని రూమర్ అనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు స్వయంగా ఆమిర్ ఖానే విషయాన్ని బయటపెట్టాడు.
ఆయన హీరోగా నటించిన తాజా సినిమా సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమిర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. కూలీ సినిమాలో తానొక ముఖ్యమైన పాత్ర చేస్తున్నానని, సినిమాలో తన పాత్ర నిడివి తక్కువే అయినా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని, కూలీలో తన క్యారెక్టర్ క్లైమాక్స్ లో వస్తుందని చెప్పి ఒక్కసారిగా కూలీపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాడు.
ఆమిర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కూలీ సినిమాలో అతనేమైనా విలన్ గా కనిపించనున్నాడా అనే అనుమానాలొస్తున్నాయి. కూలీ సినిమాలో నటించమని అడగడానికి వచ్చినప్పుడు లోకేష్ ను తాను కథ కూడా అడగలేదని, రజనీకాంత్ సినిమాలో రోల్ అనగానే వెంటనే ఓకే అన్నానని, తాను రజనీకి చాలా పెద్ద అభిమానినని, ఆయన సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా తాను రెడీగా ఉంటానని ఆమిర్ తెలిపాడు. కేవలం హీరోగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన్ని ఎంతో అభిమానిస్తా అని ఆమిర్ పేర్కొన్నాడు.