ఘనంగా 71వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ వేడుక!
ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.;
ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ జాతీయ చలనచిత్ర అవార్డులలో చాలామంది నటీనటులకు ఉత్తమ చలనచిత్ర అవార్డ్స్ లభించాయి. అలా కేవలం ఉత్తమ నటుడు,నటీమణి అవార్డులు మాత్రమే కాకుండా ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ కొరియోగ్రాఫర్, ఉత్తమ సినిమాలు ఇలా ప్రతి ఒక్క కేటగిరీలో అవార్డులు ప్రకటించారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. మంగళవారం రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నేషనల్ ఫిలిం అవార్డ్స్ వేడుకను చాలా అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో దేశ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా చాలామందికి అవార్డులతోపాటు ప్రశంసాపత్రాలను కూడా అందించారు.
అలా ఉత్తమ నటుడు విభాగంలో నేషనల్ అవార్డుని షారుఖ్ ఖాన్(జవాన్) తో పాటు విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) కూడా అందుకున్నారు. అలాగే ఉత్తమ నటీమణి అవార్డుని బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ(మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే) అందుకోగా.. స్పెషల్ కేటగిరీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అందుకున్నారు.. 2023 సంవత్సరంలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన నటీనటులతోపాటు సినిమాలను కూడా ఎంపిక చేసి ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకని నిర్వహించారు..
ఇందులో ఉత్తమ సినిమాగా టాలీవుడ్ నుండి అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాకి అవార్డు వరించింది.ఈ అవార్డుని నిర్మాత సాహు గారపాటితో పాటు సినిమాకి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి అందుకున్నారు. అలాగే ఉత్తమ నేపథ్య గాయకుడిగా 'బేబీ' మూవీలో సాంగ్ పాడిన పీవీఎన్ఎస్ రోహిత్ అవార్డుని అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు బేబీ మూవీకి రాగా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ ఈ అవార్డు అందుకున్నారు. అలాగే బెస్ట్ యానిమేషన్ విజువల్ మూవీ గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన 'హనుమాన్' మూవీకి అవార్డు వరించింది. ఇక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా 'గాంధీతాత చెట్టు'మూవీలో నటించిన డైరెక్టర్ సుకుమార్ కూతురు బాలనటి సుకృతి వేణి అందుకోగా.. ఉత్తమ నేపద్య సంగీతం కేటగిరీలో 'యానిమల్' మూవీకి మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ అవార్డు అందుకున్నారు.
అయితే ఈ 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్ ని వరించడంతో ఈ ఈవెంట్లో మోహన్ లాల్ ని స్పెషల్ గా శాలువాతో సన్మానం చేసి అవార్డు ఇచ్చారు. ఇక ఈ ఈవెంట్లో మోహన్ లాల్ మాట్లాడుతూ.. "నేను కలలో కూడా ఊహించని విజయం ఇది.. ఎందుకంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నాకు వస్తుందని నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం చాలా గౌరవంగా అనిపిస్తోంది.అలాగే నేను అందుకున్న ఈ అవార్డు నాకు ఒక్కడికి మాత్రమే కాదు మలయాళ సినీ ఇండస్ట్రీ మొత్తానికి అంకితం. ఈ అవార్డు వచ్చిన ఉత్సాహంలో మరింత బాధ్యతగా పనిచేస్తాను" అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.