జాతీయ అవార్డులకు వేదిక ఫిక్స్.. విజేతలు జూరీకి ఆహ్వానం!
పురస్కారాలు ఉత్సాహం పెంచుతాయి. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు తమ కృషి, శ్రమకు దక్కిన గౌరవంగా భావిస్తారు.;
పురస్కారాలు ఉత్సాహం పెంచుతాయి. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు తమ కృషి, శ్రమకు దక్కిన గౌరవంగా భావిస్తారు. భవిష్యత్ ప్రాజెక్టుల కోసం మరింత హార్డ్ వర్క్ చేసేందుకు కూడా ప్రేరణగా నిలుస్తాయి. ముఖ్యంగా జాతీయ స్థాయి అవార్డులు అందుకుంటే ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. ఇప్పుడు జాతీయ అవార్డుల గురించి మరోసారి చర్చ జరగనుంది. ఈ ఏడాది అవార్డులను ఇప్పటికే ప్రకటించగా, విజేతలు పురస్కార గౌరవాలను అందుకునే వేదిక సిద్ధమైంది.
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ (జవాన్) -విక్రాంత్ మాస్సే (ట్వల్త్ ఫెయిల్) సంయుక్తంగా ఉత్తమ నటులుగా ఎంపికవ్వగా, మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటనకు గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది.
ఆసక్తికరంగా సౌత్ నుంచి నందమూరి బాలకృష్ణ సినిమా `భగవంత్ కేసరి` ఉత్తమ తెలుగు చిత్రం(ప్రాంతీయం)గా పురస్కారం దక్కించుకోవడం ఎన్బీకే, అనీల్ రావిపూడి టీమ్‌లో ఉత్సాహం పెంచింది. ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో హను-మాన్ పురస్కారం దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా `బలగం`లో ఊరు పల్లెటూరు పాటకు గాను కాసర్ల శ్యామ్ ని పురస్కారం వరించింది. ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్‌కు అవార్డు వరించింది.
ఆగస్టు 1న విజేతలను న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రకటించారు. ఇప్పుడు పురస్కారాల్ని అందించే వేదిక, తేదీ సమయాన్ని ఫిక్స్ చేసారు. ఈ వేడుక సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగుతుంది. 23 మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఉత్సవాలు జరుగుతాయి. అధికారిక లేఖ ద్వారా విజేతలు, జ్యూరీ సభ్యులకు సమయం, తేదీ, వేదిక వివరాలను ఇప్పటికే వెల్లడించారు. ఆహ్వానితులు ఢిల్లీ విమానాశ్రయం నుండి విమాన టిక్కెట్లు, వసతి, పికప్, డ్రాపింగ్ ప్రతి సౌకర్యం అందుతుంది. ఈసారి జాతీయ అవార్డుల వేడుకల్లో బాలకృష్ణ- అనీల్ రావిపూడి టీమ్ సందడి అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది. హనుమాన్ టీమ్ నుంచి రాజధానిలో వేడుకల కోసం ఎవరెవరు వెళతారో చూడాలి.