ఈ సారైనా ఆగిన సినిమా రిలీజవుతుందా?
కొన్ని సినిమాలు ఎప్పుడు మొదలైనా సరే రిలీజ్ మాత్రం అనుకున్న టైమ్ కు అవవు. ప్రతీ సారీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం, ఏదొక కారణం చేత అది వాయిదా పడటం.. ఇలా జరుగుతూనే వస్తుంటాయి.;
కొన్ని సినిమాలు ఎప్పుడు మొదలైనా సరే రిలీజ్ మాత్రం అనుకున్న టైమ్ కు అవవు. ప్రతీ సారీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడం, ఏదొక కారణం చేత అది వాయిదా పడటం.. ఇలా జరుగుతూనే వస్తుంటాయి. ఎన్నో సినిమాలు ఇలా రిలీజ్ వాయిదా పడ్డ సందర్భాలు చూశాం. పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు కూడా అలానే ఎన్నో వాయిదాల తర్వాత గతేడాది రిలీజై డిజాస్టర్ గా మిగిలింది.
2017లో మొదలైన ధృవ నక్షత్రం
అలాంటి సినిమాల లిస్ట్ లో ధృవ నక్షత్రం కూడా ఉంటుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటించారు. ఈ సినిమా ఎప్పుడో కరోనాకు ముందు 2017లో మొదలైంది. తొమ్మిదేళ్లు అయినా ఇప్పటికీ ధృవ నక్షత్రం రిలీజ్ కాలేదు. ఎప్పటికప్పుడు అదిగో ఇదుగో అంటున్నారు తప్పించి సినిమాను రిలీజ్ మాత్రం చేయడం లేదు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆలస్యం
రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ ను అందించగా, ఈ సినిమాకు దర్శకత్వంతో పాటూ నిర్మాణ బాధ్యతలు కూడా గౌతమ్ మీననే చూసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సినిమా పూర్తవడానికి బాగా టైమ్ తీసుకున్న ధృవ నక్షత్రం సినిమాకు ఎట్టకేలకు 2023లో షూటింగ్ ను పూర్తి చేశారు. షూటింగ్ పూర్తైంది ఇక రిలీజే ఆలస్యమనుకున్నారంతా. కానీ ఎప్పటికప్పుడు సినిమా రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది.
ఫిబ్రవరిలో రిలీజ్ కు సన్నాహాలు
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ సినిమా జన నాయకుడు రిలీజ్ డేట్, పోటీ లేని టైమ్ ను చూసుకుని సరిగ్గా ఆ టైమ్ లో ధృవ నక్షత్రంను దింపాలని గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే పలు వాయిదాల వల్ల ఈ సినిమాకు డ్యామేజ్ బాగా జరగడంతో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక సినిమా ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ సినిమా ఆడియన్స్ లోకి వెళ్లక నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఎంతోకాలం ల్యాబ్ లోనే మగ్గిపోయిన విశాల్ సినిమా మదగజరాజా ఎలాగైతే గతేడాది సడెన్ గా రిలీజై సూపర్ హిట్ అయిందో అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని గౌతమ్ మీనన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి చూడాలి ధృవ నక్షత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో!