విదేశీ విద్యపై తగ్గుతున్న ఆసక్తి: రెండేళ్లలో 31 శాతం పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య!

ఒకప్పుడు మధ్యతరగతి విద్యార్థి కల.. ఉన్నత వర్గాల హోదా.. వెరసి 'విదేశీ విద్య'. కానీ గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఆ మోజు క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది.;

Update: 2026-02-26 11:30 GMT

ఒకప్పుడు మధ్యతరగతి విద్యార్థి కల.. ఉన్నత వర్గాల హోదా.. వెరసి 'విదేశీ విద్య'. కానీ గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఆ మోజు క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. 2023లో 9 లక్షలకు పైగా ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2025 నాటికి 6.26 లక్షలకు పడిపోవడం గమనార్హం. కేవలం రెండేళ్ల వ్యవధిలో 31 శాతం క్షీణత నమోదు కావడం అనేది కేవలం ఒక సంఖ్య మార్పు మాత్రమే కాదు.. ఇది విద్యార్థుల ప్రాధాన్యతల్లో, ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో వస్తున్న పెనుమార్పులకు సంకేతం.

కఠిన నియమాలు.. భారమైన కలలు

భారతీయ విద్యార్థులకు అత్యంత ఇష్టమైన గమ్యస్థానాలైన కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇటీవల తమ వీసా నిబంధనలను ఉక్కుపాదంతో కఠినతరం చేశాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను తీసుకెళ్లే అవకాశం లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే 'పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్' నిబంధనల్లో మార్పులు చేశారు.. ట్యూషన్ ఫీజులతో పాటు నివాస ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూపాయి విలువ పతనం కూడా మధ్యతరగతి కుటుంబాలకు ఈ భారాన్ని మోయలేనిదిగా మార్చేసింది.

భద్రత , ఉపాధిపై సందిగ్ధత

విదేశీ గడ్డపై ఇటీవల విద్యార్థులపై జరుగుతున్న దాడులు, జాతి వివక్ష ఘటనలు తల్లిదండ్రుల్లో ఆందోళన నింపుతున్నాయి. దీనికి తోడు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం కారణంగా విదేశాల్లో చదువు ముగించినా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లభించడం లేదు. భారీగా అప్పులు చేసి వెళ్లిన విద్యార్థులు, అక్కడ ఉపాధి దొరక్కపోతే ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని గ్రహిస్తున్నారు.

భారతదేశంలో మారుతున్న విద్యా ముఖచిత్రం

మరోవైపు స్వదేశంలోనే నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం ఒక సానుకూల పరిణామం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం, ఐఐటీలు, ఐఐఎంల విస్తరణ, విదేశీ యూనివర్సిటీలు భారత్‌లోనే తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం విద్యార్థులను ఆలోచింపజేస్తున్నాయి. "ఖర్చు తక్కువ.. భద్రత ఎక్కువ" అనే సూత్రం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

విదేశీ విద్య అనేది ఇప్పుడు కేవలం ఒక 'స్టేటస్ సింబల్' కాదు. విద్యార్థులు ఇప్పుడు అత్యంత లాజికల్‌గా ఆలోచిస్తున్నారు. పెట్టుబడి ఎంత? వచ్చే ప్రతిఫలం ఎంత? అనే లెక్కలతో అడుగులు వేస్తున్నారు. విదేశీ యూనివర్సిటీలు తమను కేవలం ఒక 'ఆదాయ వనరు'గా చూస్తున్నాయన్న భావన కూడా విద్యార్థుల్లో పెరిగింది.

ప్రభుత్వాలు ఇప్పటికైనా విదేశీ విద్యపై ఉన్న మోజును తగ్గించేలా స్వదేశీ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిస్తే మేధో వలసలను అరికట్టడమే కాకుండా దేశ సంపద దేశంలోనే ఉండేలా చూడవచ్చు. విదేశీ ప్రయాణం తగ్గడం అనేది భారత్‌కు ఒక రకంగా మేలు చేసే పరిణామమే అని చెప్పక తప్పదు.

Tags:    

Similar News