అసలైన మిడిల్ క్లాస్ కిల్లర్ ఇదే... దాదాపు అందరూ బాధితులే!
ఈ సందర్భంగా స్కూల్స్ స్టార్ట్ అయిన నేపథ్యంలో తమ పిల్లల స్కూల్స్ లో ఫీజులు చెల్లిస్తున్న తల్లితండ్రులు వారి వారి ఆవేదనలను ఆన్ లైన్ వేదికగా వెల్లడిస్తున్నారు;
భారతదేశంలో విద్య.. వ్యాపారం కాదు, కాకూడదు! కాగితాలమీద సరే... రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలన్నీ మధ్య తరగతి తల్లితండ్రుల రక్తం పీలుస్తున్నాయనే చర్చ గత కొంతకాలంగా విపరీతంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే! పైగా.. ఆ ప్రైవేటు పాఠశాల యజమానులకు ప్రభుత్వాలతో బంధాలు ఉండటం దీని తీవ్రతను మరింత పెంచుతుందని అంటున్నారు.
ఈ సందర్భంగా స్కూల్స్ స్టార్ట్ అయిన నేపథ్యంలో తమ పిల్లల స్కూల్స్ లో ఫీజులు చెల్లిస్తున్న తల్లితండ్రులు వారి వారి ఆవేదనలను ఆన్ లైన్ వేదికగా వెల్లడిస్తున్నారు. ఊహించని స్థాయిలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించాల్సిరావడం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా సీఎ కం టీచర్ మీనల్ లింక్డిన్ వేదికగా స్పందించారు.
అవును... భారతదేశంలో (ప్రైవేట్) విద్య ఒక ప్రత్యేక హక్కుగా కాకుండా ఆర్థిక ఉచ్చుగా మారుతోందని చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ అన్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పెరుగుతున్న పాఠశాల ఫీజులతో పూర్తిగా నలిగిపోతున్నారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నిర్మాణాన్ని విశ్లేషించారు.
ఇందులో భాగంగా... ప్రతి బిడ్డ విద్యకు సంవత్సరానికి రూ.2.5 నుండి 3 లక్షలు ఖర్చవుతుందని చెబుతూ.. ఇందులో రూ.35,000 అడ్మిషన్ ఫీజు, రూ.1.4 లక్షలు ట్యూషన్ ఫీజు, రూ.38,000 వార్షిక ఫీజు, రూ.44,000 నుండి 73,000 రవాణా ఫీజు, రూ.20,000 నుండి 30,000 వరకు పుస్తకాలు, యూనిఫాం ఫీజు, మొదలైనవి ఉన్నాయని ఆమె వివరించారు.
ప్రాథమిక పాఠశాలల ఫీజులు లక్ష రూపాయల నుండి ప్రారంభమవుతున్నాయని.. ఉన్నత పాఠశాలకు వెళ్లే సరికి అది కాస్తా సులభంగా రూ.4 లక్షల వరకు చేరుతుందని ఆమె పేర్కొన్నారు. భారతదేశంలో విద్యా ద్రవ్యోల్బణం మధ్యతరగతికి నిశ్శబ్ద ఆయుధంగా మారుతోందని పోస్ట్ లో రాశారు. ఇప్పుడు గృహ రుణాలతో పాటు, స్కూలు ఫీజులకు ఈఎంఐలు మొదలయ్యాయని తెలిపారు!
ఈ స్థాయిలో మద్యతరగతిపై ప్రైవేటు స్కూల్స్ దోపిడీకి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితి దయనీయంగా ఉండటం ఒక కారణమని చెప్పిన ఆమె... లక్షల పాఠశాలలకు విద్యుత్ లేదని.. మరుగుదొడ్లు లేవని.. తాగునీరు కూడా లేదని తెలిపారు. భారతదేశం తన జీడీపీలో 4.6% మాత్రమే విద్య కోసం ఖర్చు చేస్తుందని.. ఇది సిఫార్సు చేయబడిన 6% కంటే చాలా తక్కువని అన్నారు.
లాభాపేక్షలేని సంస్థలుగా పనిచేయడానికి అని చెప్పే ప్రైవేట్ పాఠశాలలు.. పలు లొసుగులను కనుగొన్నాయని.. యజమానులు షెల్ కంపెనీల ద్వారా తమ సొంత పాఠశాలలకు ఆస్తులను అద్దెకు ఇస్తారని.. అధిక అద్దెలు వసూలు చేస్తారని.. ఆ భారాన్ని తల్లిదండ్రులపై మోపుతారని.. యజమానులు మాత్రం పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటారని తన పోస్టులో తెలిపారు!