భారత రాష్ట్రాల్లో అక్షరాస్యత రేటు ఎంత? రాష్ట్రాల వారీగా అక్షరాస్యత గణాంకాలు!
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? జాతీయ సగటుతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం? వంటి ఆసక్తికర విషయాలను ఇప్పడు తెలుసుకుందాం..;
చదువుకుంటేనే లోకం తెలుస్తుంది అంటారు పెద్దలు. మరి మన దేశంలో ఎంతమంది చదువుకున్నారో తెలుసా? తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం భారత దేశం అక్షరాస్యతలో కీలక మార్పులు నమోదు చేసింది. కొన్ని రాష్ట్రాలు వంద శాతానికి చేరువలో ఉంటే, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? జాతీయ సగటుతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం? వంటి ఆసక్తికర విషయాలను ఇప్పడు తెలుసుకుందాం..
టాప్ లో ఉన్న రాష్ట్రాలివే.. ఈశాన్యం నుంచి కేరళ వరకు:
గణాంకాలు గమనిస్తే అక్షరాస్యతలో ఈశాన్య రాష్ట్రమైన మిజోరం 98.2 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అక్షరాస్యత అనగానే మనకు గుర్తొచ్చే కేరళ 95.3 శాతంతో గట్టి పోటీ ఇస్తోంది. వీటితో పాటు లక్షద్వీప్ (97.3%), గోవా (93.6%) వంటి ప్రాంతాలు కూడా విద్యావంతుల సంఖ్యలో దూసుకుపోతున్నాయి. ఇక ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వం తీసుకున్న విద్యా సంస్కరణలు, ప్రజల్లో ఉన్న చైతన్యం వల్ల దాదాపు ప్రతి ఒక్కరూ కనీసం చదవడం, రాయడం నేర్చుకున్నారని అర్థమవుతోంది. ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా మెరుగైన ఫలితాలను చూపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? వెనుకబడి ఉన్నామా?:
ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తోంది. జాతీయ సగటు 80.9 శాతంగా ఉంటే, తెలంగాణ 76.9 శాతంతో దానికంటే తక్కువలో ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 72.6 శాతంగా నమోదై, దక్షిణ భారతదేశంలోనే అత్యల్పంగా ఉండటం గమనార్హం. బీహార్ (74.3%), రాజస్థాన్ (75.8%) వంటి రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని అనుకుంటున్నా, చదువు విషయంలో ఇంకా మనం వెళ్లాల్సిన దూరం చాలా ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
అక్షరాస్యత పెరగాలంటే ఏం చేయాలి? :
అక్షరాస్యతలో వెనుకబడి ఉన్న రాష్ట్రాల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం,స్కూలు మధ్యలో ఆపేయడం పెద్ద సమస్యలుగా ఉన్నాయి. ప్రభుత్వం ఉచిత విద్యను అందించినప్పటికీ, నాణ్యతలో లోపాలు ఉండటం కూడా ఒక కారణం. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించడం ద్వారా అక్షరాస్యతను వేగంగా పెంచవచ్చు. ఇక కేవలం డిగ్రీలు పెరగడమే కాదు, కనీసం చదవడం, రాయడం అనేది ప్రతి పౌరుడి హక్కు. అప్పుడే దేశం ఆర్థికంగా కూడా బలపడుతుంది. అందుకే వెనుకబడిన రాష్ట్రాలు కేరళ, మిజోరం వంటి రాష్ట్రాలను చూసి కొత్త పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.