ఫోన్ మాట్లాడొద్దన్న భర్తను గొడ్డలి వేటుతో చంపేసింది

సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందన్న కోపంతో భార్యను మందలించిన భర్త హతమయ్యాడు. ఏపీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాక్ కు గురి చేసేలా మారింది.;

Update: 2025-12-11 04:14 GMT

సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందన్న కోపంతో భార్యను మందలించిన భర్త హతమయ్యాడు. ఏపీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాక్ కు గురి చేసేలా మారింది. అదే పనిగా ఫోన్ లో మాట్లాడుతూ ఇంటి పనుల్ని పట్టించుకోని భార్య తీరును తప్పు పట్టిన భర్తను అంతమొందించేందుకు వెనుకాడని భార్య ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయితీ మేడూరు గ్రామానికి చెందిన 46 ఏళ్ల రాజారావు.. దేవి దంపతులు.

వీరికి ముగ్గురు సంతానం. ఇదిలా ఉండగా.. రెండేళ్ల క్రితం ఒక వ్యక్తితో దేవి ఫోన్ మాట్లాడటం మొదలు పెట్టింది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎక్కువ సమయం ఫోన్ కే సరిపోతుందన్న ఆగ్రహాన్ని భర్త ప్రదర్శించేవారు. ఇంటి పనులు సరిగా చేయట్లేదని.. పిల్లల్ని పట్టించుకోవటం లేదన్న అంశాలపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదిలా ఉండగా మూడురోజుల క్రితం పొద్దున్నే ఫోన్ మాట్లాడుతున్న దేవి మీద భర్త రాజారావు ఆగ్రహాన్ని ప్రదర్శించటంతో పాటు..ఇకపై ఫోన్ మాట్లాడటానికి వీల్లేదని గద్దించాడు.

దీంతో ఆగ్రహానికి గురైన దేవి.. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల వేళలో గాఢనిద్రలో ఉన్న భర్తపై గొడ్డలితో దాడికి దిగింది. భర్త తల వెనుక భాగంలో గొడ్డలితో బలంగా వేటు వేసింది. దీంతో రాజారావు స్ప్రహ కోల్పోయాడు. రాజారావు పక్కనే నిద్రపోతున్న కొడుకు నిద్ర లేచేసరికి.. తండ్రి చెవులు.. నోరు.. ముకకు నుంచి రక్తం కారుతున్న విషయాన్ని గుర్తించి.. అక్కను లేపి విషయం చెప్పాడు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్థానికంగా ఉన్న ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజారావు మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్య దేవిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగు చూశాయి.

Tags:    

Similar News