కింగ్డమ్ డే 1 బాక్సాఫీస్: లైగర్ ను కొట్టిందా లేదా?
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'కింగ్డమ్' సినిమా గ్రాండ్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.;
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'కింగ్డమ్' సినిమా గ్రాండ్ గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామాపై ముందు నుంచే ప్యాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ కనిపించింది. ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. కానీ సినిమా విడుదల తర్వాత టాక్ మాత్రం మిక్స్‌డ్ గా ఉన్నప్పటికీ, బుకింగ్స్ పరంగా పర్వాలేదనిపించే రేంజ్‌లో వసూళ్లు వచ్చాయి.
రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్స్ టాక్ మిక్స్‌డ్ గా ఉంది. విజయ్ నటన, విజువల్స్, అనిరుధ్ మ్యూజిక్‌కి ప్రశంసలు దక్కాయి. అయితే కథలో కొత్తదనం అంతగా లేదని, సెకండ్ హాఫ్‌లో కథ డల్ అయిందని పలువురు అభిప్రాయపడ్డారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’తో పొందిన పేరును ఈ సినిమాతో కొనసాగించలేకపోయాడన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయినా 'కింగ్డమ్' ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నదని కొందరు ట్వీట్ చేశారు.
లైగర్ ను దాటలేదు
రిలీజ్ అయిన రోజు ఉదయం షోలు హడావుడిగా నడవగా, ఆ తర్వాత సెంటర్లలో ప్రేక్షకుల వర్షం కాస్త తగ్గింది. తొలి రోజున దేశవ్యాప్తంగా 'కింగ్‌డమ్' సుమారు రూ.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విజయ్ దేవరకొండ గత చిత్రమైన ‘ది ఫ్యామిలీ స్టార్’ కలెక్షన్ (రూ.5.75 కోట్లు)తో పోలిస్తే ఇది మెరుగైన ఓపెనింగ్ అని చెప్పాలి. కానీ, అతని కెరీర్‌లో ఇప్పటిదాకా బెస్ట్ ఓపెనింగ్ అయిన 'లైగర్' (రూ.15.95 కోట్లు)ను మాత్రం 'కింగ్‌డమ్' దాటలేకపోయింది. ఉదయం షోలకు 63%కి పైగా ఆక్యుపెన్సీ ఉండగా, నైట్ షోల్లో అది 50%కి తగ్గింది.
రెండో పెద్ద ఓపెనింగ్ విజయ్ కు
బాక్సాఫీస్ పరంగా చూస్తే, కింగ్‌డమ్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో రెండో పెద్ద ఓపెనింగ్ ఇచ్చిన చిత్రం. లైగర్ (రూ.15.95 కోట్లు) తర్వాత, కింగ్‌డమ్ (రూ.15.75 కోట్లు నెట్) సాధించిన వసూళ్లు మంచి విషయమే. గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఫలితం నిరాశపరిచిన తర్వాత, విజయ్ కు ఇది కమర్షియల్ గా ఓపెనింగ్ వరకు అయితే రిలీఫ్ ఇచ్చింది. ఈసారి ఎలాంటి సెలవులు లేకుండా, ఇతర భాషల్లో పరిమిత రిలీజ్‌తో కూడా ఇంత వసూళ్లు రావడం నిర్మాతలకు తృప్తినిచ్చే అంశమే.
ప్రమోషన్స్ క్రేజ్ వల్లే..
సినిమాకు మినిమమ్ గ్యారెంటీ ఓపెనింగ్ రావడానికి హైప్ మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా ప్రధాన కారణం. ట్రైలర్ నుంచి ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ వరకు ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేలా చేశారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో విజయ్ మార్కెట్ మళ్లీ స్ట్రాంగ్ అనిపించుకుంటోంది. ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ ఓ మోస్తరు వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి, 'కింగ్‌డమ్' టాక్ పరంగా పెద్దగా సర్వత్రా హైప్ పెంచేలా లేకపోయినా, డే 1 వసూళ్లు మాత్రం విజయ్ మార్కెట్‌ను నిలబెట్టేలా వచ్చాయి. 'లైగర్' రికార్డును మాత్రం దాటలేకపోయినప్పటికీ, ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇది రెండో పెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. ఇక ఇలాంటి టాక్ తో వీకెండ్ వరకు సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.