ఉస్తాద్, ధురంధర్.. ఊపిరి పోసినట్లే..

ఉగాది పండుగ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్: ది రివెంజ్ చిత్రాలు.. థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;

Update: 2026-03-20 17:26 GMT

ఉగాది పండుగ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్: ది రివెంజ్ చిత్రాలు.. థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కొత్త జోష్ తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి నెల అంతా బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. పెద్ద సినిమాలు లేకపోవడం, విడుదలైన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో థియేటర్లలో కలెక్షన్లు వీక్ గా కనిపించాయి.

2026 సంక్రాంతి సందర్భంగా వచ్చిన సినిమాల ఎఫెక్ట్ తగ్గిన తర్వాత, టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సందడి కనిపించలేదు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త హిట్ కోసం ఎదురుచూస్తూ ఉండగా, మార్చి నెల ప్రారంభం కూడా పెద్దగా ఆశలు రేకెత్తించలేదు. అయితే ఆ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసిన రెండు సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ ది రివెంజ్.

ఆ రెండు చిత్రాలు విడుదలైన తొలి రోజు సాలిడ్ వసూళ్లు సాధించాయి.. ముఖ్యంగా ఉస్తాద్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.37 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ధురంధర్ కూడా అన్ని భాషల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అలా రెండు సినిమాలు కూడా మంచి ఓపెనింగ్స్ అందుకున్నాయని చెప్పాలి.

ఇప్పుడు ఆ రెండు సినిమాల విజయంతో ఫిబ్రవరి నెలలో నెలకొన్న బాక్సాఫీస్ నిరుత్సాహం ఒక్కసారిగా తొలగిపోయింది. ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రావడం ప్రారంభించడంతో ఎగ్జిబిటర్లలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ కలెక్షన్లు కూడా భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్ లో జరుగుతున్నాయని వినికిడి.

అయితే ఉస్తాద్ సినిమా విషయానికొస్తే.. ఇది కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని అర్థమవుతోంది. కథ, యాక్షన్ సన్నివేశాలు, సంగీతం.. సినిమాకు పాజిటివ్ ఎలిమెంట్స్ గా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు ధురంధర్ 2 కూడా తన కథనం, ప్రెజెంటేష న్‌తో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని దూసుకుపోతోంది.

ఏదేమైనా సంక్రాంతి తర్వాత వచ్చిన గ్యాప్‌ ను ఆ రెండు సినిమాలు భర్తీ చేయడం విశేషం. సాధారణంగా ఇది పరీక్షల సమయం కాబట్టి.. సినిమాలకు కొంత కష్టమైనదిగా భావిస్తారు. కానీ సరైన కంటెంట్ ఉంటే ఎప్పుడైనా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే విషయాన్ని ఉస్తాద్, ధురంధర్ ది రివెంజ్ నిరూపించాయి. మొత్తానికి, ఫిబ్రవరి నెలలో ఏర్పడిన నిరాశ పరిస్థితికి ముగింపు పలుకుతూ ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ సినిమాలు బాక్సాఫీస్‌ కు కొత్త ఊపిరి పోశాయని చెప్పాలి. మరి ఆ రెండు సినిమాలు ఎంతటి వసూళ్లు సాధిస్తాయో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News