ఈసారి దురంధర్ కౌంట్ 2 వేల కోట్లేనా?
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప చిత్రాల తర్వాత ఇండియన్ సినిమాలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన సీక్వెల్ దురంధర్-2నే. పై మూడు చిత్రాల్లాగా దీని కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది;
బాహుబలి, కేజీఎఫ్, పుష్ప చిత్రాల తర్వాత ఇండియన్ సినిమాలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన సీక్వెల్ దురంధర్-2నే. పై మూడు చిత్రాల్లాగా దీని కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేకపోయింది. పార్ట్-1 వచ్చిన మూడున్నర నెలలకే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన దురంధర్ ఏకంగా రూ.1400 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. అలాంటిది దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెంచేసిన దురంధర్-2 ఇంకెంత కలెక్ట్ చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు ముందు రోజు సాయంత్రం నుంచే దురంధర్-2 ప్రిమియర్స్ పడిపోయాయి. చివరి నిమిషం హడావుడి వల్ల కొంత ఇబ్బంది తలెత్తినా.. షోలు పడ్డాక అంతా మారిపోయింది. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. హైప్ ఇంకా పెరిగిపోయింది. దీంతో తొలి రోజు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచింది దురంధర్-2. డబ్బింగ్ వెర్షన్లు సమయానికి పడకపోవడం ఒక్కటే మైనస్. అయినా సరే అవి రిలీజ్ కాని షోల్లోనూ హిందీ వెర్షన్‌ను వేసేస్తున్నారు.
ముందే భారీ హైప్ ఉంది. పైగా దురంధర్‌ను మించి అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. జనాలు సినిమాను విరగబడి చూస్తున్నారు. ఇక ముందూ చూస్తారు. సినిమాకు లాంగ్ రన్ ఉండబోతోందని స్పష్టమవుతోంది. కాబట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు నమోదు కావడం లాంఛనమే. డొమెస్టిక్, ఓవరాల్ వసూళ్ల విషయంలో పాత రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ముందు రోజు ప్రిమియర్స్ కూడా కలుపుకుంటే తొలి రోజు వసూళ్లు రూ.200 కోట్లకు తగ్గేలా లేవు. లాంగ్ వీకెండ్ కారణంగా ఆదివారం అయ్యేసరికే సినిమా రూ.500 కోట్ల మైలురాయిని అందుకుంటే ఆశ్చర్యం లేదు. రాబోయేది సమ్మర్ సీజన్ కావడంతో వసూళ్లకు ఢోకా ఉండదు. కాబట్టి ఫుల్ రన్లో రూ.2 వేల కోట్ల మార్కును అందుకోవడం.. దంగల్ పేరిట ఉన్న ఓవరాల్ వసూళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టడం.. ఇండియా వరకే రూ.వెయ్యి కోట్ల మైలరాయిని అందుకున్న తొలి చిత్రంగా నిలవడం.. ఈ ఘనతలన్నీ దురంధర్-2 ఖాతాలో చేరడం పక్కా అని చెప్పొచ్చు.