తల్లికి తలకొరివి పెట్టని కొడుకు.. ఐదు రోజుల తర్వాత ఊరికి వస్తే తరిమికొట్టిన గ్రామస్థులు!
నవమాసాలు మోసి.. తన రక్తాన్ని పంచి పెంచిన కన్నతల్లి చివరి శ్వాస విడిస్తే.. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోని కఠినాత్ముడైన కొడుకు కథ ఇది. తల్లి మరణించిన ఐదు రోజుల తర్వాత తీరిగ్గా కర్మకాండల పేరుతో అడుగుపెట్టిన కుమారుడికి గ్రామస్థులు తగిన బుద్ధి చెప్పారు. మానవ సంబంధాలు ఆస్తుల ముందు ఎలా మంటగలుస్తున్నాయో చెప్పే ఈ హృదయవిదారక ఘటన తెలంగాణలోని జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన తల్లి (75) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ గత సోమవారం తుదిశ్వాస విడిచారు. ప్రాణం పోయే ముందు ఆ తల్లి కళ్లు తన ఏకైక కుమారుడు రాక కోసం ఆశగా ఎదురుచూశాయి. "నా కొడుకు వస్తాడు.. నా చివరి ప్రయాణంలో తోడుగా ఉంటాడు.. నాకు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంటాడు" అని ఆ మాతృమూర్తి ఆఖరి క్షణం వరకు తపించిపోయింది. కానీ ఆ తల్లి ఆశ నెరవేరలేదు. తల్లి మరణవార్త తెలిసినా కొడుకు కనీసం చూసేందుకు కూడా రాలేదు. కన్నకొడుకు రాకపోవడంతో గ్రామస్థులే మానవత్వంతో ముందుకొచ్చి ఆ అభాగ్యురాలికి అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు.
తల్లి చనిపోయి ఐదు రోజులు గడిచాక కొడుకు కర్మకాండల పేరుతో గ్రామంలో అడుగుపెట్టాడు. ఇది చూసిన గ్రామస్థుల రక్తం మరిగిపోయింది. తల్లి బతికున్నప్పుడు కనీసం పట్టించుకోలేదు.. చనిపోయాక తలకొరివి పెట్టడానికి కూడా రాలేదు.. ఇప్పుడు ఆస్తి కోసమే వచ్చావా? అంటూ గ్రామస్థులు అతడిని నిలదీశారు. కన్నతల్లి ప్రేమ కంటే ఆస్తిపాస్తులే ఎక్కువయ్యాయా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు.. అతడిపై దాడి చేసి గ్రామం నుంచి తరిమికొట్టారు.
ఈ ఘటన ఇప్పుడు సమాజం ముందు ఒక బలమైన ప్రశ్నను ఉంచింది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో.. అనారోగ్యంతో.. ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు పట్టించుకోని పిల్లలు.. వారు కన్నుమూశాక మాత్రం ఆస్తులు.. హక్కుల కోసం ఎందుకు ఎగబడుతున్నారు? కుటుంబంలో వారి మధ్య ఏవైనా విభేదాలు ఉన్నాయా? కొడుకు అంత్యక్రియలకు రాకపోవడానికి అసలు కారణమేంటి? అనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉన్నప్పటికీ ఒక కన్నతల్లికి దక్కాల్సిన కనీస గౌరవం దక్కలేదన్నది మాత్రం చేదు నిజం.
తల్లిదండ్రులు బతికున్నప్పుడు పట్టెడన్నం పెట్టి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడటమే అసలైన బాధ్యత. వారు లేని లోకంలోకి వెళ్లిపోయాక చేసే కర్మకాండలు.. ఆర్భాటాల కంటే.. ప్రాణంతో ఉన్నప్పుడు చూపించే ఆప్యాయతే ఎంతో విలువైనది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.