'కంగారూ తోక వంకర'.. ఓటమిలోనూ లార్డ్స్ లో దక్షిణాఫ్రికాపై స్లెడ్జింగ్

కొందరు దుర్భుద్ధి ఉన్న వ్యక్తులు ఎంత చెప్పినా మారరు.. లేదా కొన్ని అలవాట్లు ఎప్పటికీ పోవు.. అలాంటి సందర్భాల్లో ’కుక్క తోక వంకర’ అనే సామెతను వాడుతుంటారు.;

Update: 2025-06-15 09:18 GMT

కొందరు దుర్భుద్ధి ఉన్న వ్యక్తులు ఎంత చెప్పినా మారరు.. లేదా కొన్ని అలవాట్లు ఎప్పటికీ పోవు.. అలాంటి సందర్భాల్లో ’కుక్క తోక వంకర’ అనే సామెతను వాడుతుంటారు. అంటే కుక్క తోకను ఎన్నిసార్లు సరిచేసినా.. అది వంకరే అవుతుంది తప్ప నిటారుగా మారదు అని అర్థం. ఇలాంటి సందర్భమే ఆస్ట్రేలియా క్రికెటర్ల విషయంలో చెప్పుకోవాల్సి వస్తే.. ’కంగారూ తోక వంకర’ అనాలేమో? ప్రపంచ క్రికెట్ లో స్లెడ్జింగ్ (దూషణ)కు మారు పేరు ఆస్ట్రేలియా క్రికెటర్లు. ఆట పట్టించడం వేరు.. దూషించడం వేరు. ఈ స్లెడ్జింగ్ ఒక్కోసారి వ్యక్తిగత దూషణల వరకు వెళ్తుంటుంది. అందుకనే గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు అంటే సదభిప్రాయం ఉండేది కాదు. ఆ జట్టుపై ఎవరు గెలిచినా తాము గెలిచినట్లే భావించేవారు. టీమ్ ఇండియా కెప్టెన్ సౌరభ్ గంగూలీ చేతిలో తీవ్ర పరాభవం తర్వాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి వాటిలో పాల్గొంటూ ఉండడంతో 20 ఏళ్లలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరు కొంత మారింది. అయితే, తాజాగా దక్షిణాఫ్రికాతో లార్డ్స్ లో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో మాత్రం ఓడిపోతున్నామని తెలిసి ఆస్ట్రేలియా ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు.

లార్డ్స్ లో మూడో రోజే దక్షిణాఫ్రికా విజయానికి బాటలు పడ్డాయి. ఆ జట్టు ఓపెనర్ మార్క్ రమ్ అద్భుత సెంచరీ, కెప్టెన్ బవుమా హాఫ్ సెంచరీలతో సఫారీల గెలుపు ఖాయమైంది. ఇక శనివారం నాలుగో రోజు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుని 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది.

అయితే, తమ గెలుపు ముంగిట ఏం చేయాలో తెలియక ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ కు దిగారని బవుమా తెలిపాడు. ఇది నాలుగో రోజు జరిగిందని వివరించాడు. కేవలం 69 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలిచే స్థితిలో ఉండడంతో వారిని మానసికింగా దెబ్బతీసే లక్ష్యంతో కంగారూలు మాటల యుద్ధానికి దిగారని తెలుస్తోంది.

స్లెడ్జింగ్ ద్వారా ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసి వారిని ఔట్ చేయడమే ఆస్ట్రేలియా వ్యూహం. ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ను ఔట్ చేయలేని స్థితితో స్లెడ్జింగ్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

కాగా, దక్షిణాఫ్రికాను ప్రతిసారి బ్యాడ్ లక్ వెంటాడుతూ ఉంటుంది. లేదా వారే ఒత్తిడిలో కూరుకుపోతుంటారు. మంచి అవకాశాలను వదిలేస్తుంటారు. అందుకనే వారిని చోకర్స్ అని ఎగతాళి చేస్తుంటారు. ఇప్పుడు ఈ పదాన్నే తాను బ్యాటింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు వాడారని బవుమా తెలిపాడు. అయినా తాము నమ్మకంతో ముందుకెళ్లి విజయం సాధించామన్నాడు. ఇక చోకర్స్ అనే ముద్ర తమపై చెరిగిపోయినట్లేనని దక్షిణాఫ్రికా స్పిన్నర్, భారత సంతతికి చెందిన కేశవ్ మహరాజ్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం అతడు భావోద్వేగంతో మాట్లాడాడు. మొత్తానికి స్లెడ్జింగ్ విషయంలో తన ధోరణి మారలేదని.. అది ఎప్పుడూ తమలో భాగమేనని ఆస్ట్రేలియా చాటింది.

Tags:    

Similar News