విరాట్ కొహ్లీ భద్రతకు ముప్పు... ప్రాక్టీస్ క్యాన్సిల్, మ్యాచ్..?

ఐపీఎల్‌ సీజన్ 17లో రసవత్తర సమరానికి వేళైన సంగతి తెలిసిందే. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బుధవారం జరిగే ఎలిమినేటర్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌ ను ఢీకొంటుంది.

Update: 2024-05-22 10:38 GMT

ఐపీఎల్‌ సీజన్ 17లో రసవత్తర సమరానికి వేళైన సంగతి తెలిసిందే. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బుధవారం జరిగే ఎలిమినేటర్‌ లో రాజస్థాన్‌ రాయల్స్‌ ను ఢీకొంటుంది. ఈ రెండు జట్ల మధ్య పోరు హోరీహోరీగా సాగుతుందని భావిస్తున్నారు. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అవును... అత్యంత కీలకమైన మ్యాచ్ ముందు ఊహించని పరిణామాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... రాజస్థాన్ రాయల్స్ తో జరగనున్న ఐపీఎల్ - 2024 ఎలిమినేటర్ మ్యాచ్ కి ముందు ఉన్న ఏకైక ప్రాక్టీస్ సెషన్ తో పాటు మీడియా సమావేశాన్ని ఆర్సీబీ రద్దు చేసుకుంది. జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే.. ఆర్సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వివరాళ్లోకి వెళ్తే... రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నేడు తలపడనున్నాయి. అయితే.. కోల్ కతా - హైదరాబాద్ మ్యాచ్ కారణంగా.. నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్.ఆర్., ఆర్సీబీ జట్లు ప్రాక్టీస్ చేయలేకపోయాయి. దీంతో... వీటి ప్రాక్టీస్ కోసం గుజరాత్ కాలేజ్ గ్రౌండ్స్ ని కేటాయించారు. అయినప్పటికీ ఆర్సీబీ ప్రాక్టీస్ చేయలేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రాక్టీస్ చేసుకుంది.

ఇలా ఆర్సీబీ జట్టు ప్రాక్టీస్ చేయకపోవడానికి, మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించకపోవడానికి ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉండటమే అసలు కారణం అని తెలుస్తుంది. దీనికి సంబంధించి అహ్మదాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా ఐ.ఎస్.ఐ.ఎస్. ఉగ్రవాదులని తెలుస్తుంది.

Read more!

ఈ వ్యవహారంపై పోలీసు అధికారి విజయ్ సింఘ జ్వలా స్పందించారు. ఇందులో భాగంగా... నలుగురు అరెస్ట్ అయ్యారన్న విషయం.. అహ్మదాబాద్ కు వచ్చిన తర్వాత కోహ్లీ తెలుసుకున్నారని తెలిపారు. విరాట్ కోహ్లీ సెక్యూరిటీకి కీలక ప్రాధాన్యత ఇవ్వాలని.. అందుకే ఆర్సీబీకి రిస్క్ తీసుకోవాలనుకోలేదని.. ఫలితంగా ప్రాక్టీస్ చేయడం లేదని తమకు చెప్పారని తెలిపారు.

మరోవైపు.. అహ్మదాబాద్ లో ఆర్సీబీ టీమ్ బస చేస్తున్న హోటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో... ఆర్సీబీ సభ్యులకు ప్రత్యేక ఎంట్రీని ఏర్పాటుచేసి, అందులోకి ఇతరులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది. మరోపక్క స్టేడియానికి 5 వేల మంది పోలీసులు, వెయ్యి మంది ప్రైవేటు సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నారు.

Tags:    

Similar News