అదే కోహ్లి.. అదే సిడ్నీ.. ఇక రిటైర్మెంట్ ఖాయమా?
ఈ నేపథ్యంలో శనివారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో వన్డే కోహ్లి అంతర్జాతీయ కెరీర్ లో ఆఖరి మ్యాచ్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అతడి నిర్ణయం ఏమిటో..?;
ఆస్ట్రేలియా గడ్డపై మొట్టమొదటి డకౌట్... కెరీర్ లో వన్డేల్లో వరుసగా తొలిసారి రెండు డకౌట్లు... పెవిలియన్ కు చేరే సందర్భంలో గ్లోవ్స్ తీసేసి, ఇక సెలవ్ అన్నట్లుగా అభిమానులకు చెయ్యెత్తి అభివాదం.. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ఖాయమేనా? అనే వాదనలు..! ఇదీ టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి గురించి రెండు రోజులుగా నడుస్తున్న చర్చ! ఈ నేపథ్యంలో శనివారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో వన్డే కోహ్లి అంతర్జాతీయ కెరీర్ లో ఆఖరి మ్యాచ్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అతడి నిర్ణయం ఏమిటో..?
ఈ మ్యాచ్‌లో ఆడితేనే..
వరుసగా రెండు డకౌట్లు అంటే కోహ్లి స్థాయి ఆటగాడికి కాస్త కష్టమే. కానీ, అతడు చాంపియన్ ప్లేయర్. కెరీర్‌లో ఇలాంటి ఎన్నో కష్టాలను దాటుకుని వచ్చినవాడు. వచ్చే నవంబరు 5వ తేదీతో 37 ఏళ్లు పూర్తి చేసుకోనున్న కోహ్లి.. నిరుడు టి20 ప్రంపచ కప్ గెలిచాక ఆ ఫార్మాట్ వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుండగా మే నెలలో తనకు ఎంతో ఇష్టమైన టెస్టుల నుంచి కూడా వైదొలగాడు. మార్చిలో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత కోహ్లి మళ్లీ ఆస్ట్రేలియాతో గత ఆదివారం టీమ్ ఇండియా జెర్సీలో మైదానంలోకి దిగాడు. కానీ, ఆ మ్యాచ్, బుధవారం నాటి గేమ్ లో ఖాతా తెరవలేకపోయాడు. అందుకనే అతడు వన్డేల నుంచి కూడా తప్పుకొంటాడనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ శనివారం మూడో వన్డేలోనూ కోహ్లి విఫలమైతే ఇవే నిజం కావొచ్చు.
రిటైర్ కాకుంటే..
ఒకవేళ కోహ్లికి కొనసాగే ఉద్దేశం ఉంటే పరిస్థితి ఏంటి? అనేది చూడాలి. కోహ్లి, రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్ లో మూడు మ్యాచ్‌లలోనూ సెంచరీలు చేసినా వారిని 2027 వన్డే ప్రపంచ కప్ నకు ఎంపిక చేస్తామని చెప్పలేం అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో విఫలమైన కోహ్లిని దక్షిణాఫ్రికాతో నవంబరు 30 నుంచి, న్యూజిలాండ్ తో జనవరి 11 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్ కు ఎంపిక చేస్తారా? అనేది కచ్చితంగా సమాధానం ఇవ్వలేని ప్రశ్నే.
అప్పుడు సిడ్నీ.. ఇప్పుడు సిడ్నీనే..
కోహ్లి ఈ ఏడాది ప్రారంభంలో సిడ్నీలో ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఐదోది, ఆఖరి టెస్టు ఆడాడు. కానీ, అందులో రాణించలేదు. అసలు ఈ సిరీస్ లో మొదటి టెస్టులో సెంచరీ మినహా అంతా వైఫల్యమే. తన బలహీనత అయిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని ఆడబోయి వికెట్ ఇచ్చేశాయడంతో సెలక్టర్లు ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక కష్టమే అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతోనే కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు వన్డేల వంతు..? అందుకే శనివారం సిడ్నీలో జరిగే వన్డేపై అందరి ఫోకస్ ఉంది.