0(8), 0(4)... క్రికెట్ కు విరాట్ కోహ్లి గుడ్ బై...!?
కోహ్లి ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో జేవియర్ బ్రాట్ లెట్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పెద్దగా పేరు లేని బ్రాట్ లెట్ బౌలింగ్ లో పెద్దగా పేస్ లేని బంతికి కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు.;
వరుసగా రెండు మ్యాచ్ (వన్డే)లలో డకౌట్... తాను ఒకప్పుడు చెలరేగి ఆడి మేటి బౌలర్ ను ఉతికి ఆరేసిన గ్రౌండ్ లోనే ఓ సాధారణ బౌలర్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు.. కనీసం రివ్యూ కూడా తీసుకోలేదు.. ఔట్ అయి తిరిగి పెవిలియన్ కు వెళ్తుండగా అతడి బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒకప్పటి అతడేనా ఇతడు? అనిపించిది.. అభిమానులు పాజిటివ్ గా, ఉత్సాహంగానే పలకరిస్తున్నా.. తను మాత్రం చేయి ఎత్తి.. ఇక వీడ్కోలు అన్నట్లు అభివాదం చేశాడు. ఇదంతా చూస్తుంటే భారత క్రికెట్ లో... ప్రపంచ క్రికెట్ లో ఒక శకం ముగిసిందా? అనే సంకేతాలు వస్తున్నాయి.
వరుసగా రెండోసారి..
ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ మైదానం టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫేవరెట్ మైదానం. ఇక్కడ ఐదు సెంచరీలు సహా కోహ్లి మూడు ఫార్మాట్లలో 975 పరుగులు చేశాడు. గురువారం మాత్రం ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో డకౌట్ గా వెనుదిరిగాడు. 2008లో శ్రీలంకపై శ్రీలంకలో వన్డే అరంగేట్రం చేసిన కోహ్లి వరుసగా రెండు మ్యాచ్ లలో డకౌట్ కావడం ఇదే తొలిసారి. 2021లో అహ్మదాబాద్ టెస్టులో, టి20లో రెండుసార్లు డకౌట్ అయ్యాడు. మొత్తమ్మీద అంతర్జాతీయ క్రికెట్ లో 40వ సారి డకౌట్ అయ్యాడు.
ఇక రిటైర్మెంట్?
కోహ్లి ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో జేవియర్ బ్రాట్ లెట్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పెద్దగా పేరు లేని బ్రాట్ లెట్ బౌలింగ్ లో పెద్దగా పేస్ లేని బంతికి కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. అవతలి ఎండ్ లో ఉన్న రోహిత్ ను సంప్రదించినప్పటికీ కనీసం రివ్యూ కూడా తీసుకోలేదు. ఆసీస్ పై తొలి వన్డేలో 8 బంతులు ఆడిన కోహ్లి ఖాతా తెరవలేదు. ఈ వన్డేలో 4 బంతులే ఎదుర్కొన్నాడు. ఒక్కసారిగా లోపలకు వచ్చిన బంతిని ఆడబోయి ప్లంబ్ అయ్యాడు. ఇక ఔట్ అయి వెళ్లిపోతుండగా అభిమానులు ఉత్సాహంగానే పలకరిస్తున్నా.. కోహ్లి నిర్వేదంగా కనిపించాడు. కుడిచేతిని కాస్త పైకి ఎత్తి అభివాదం చేశాడు. దీంతో అతడు రిటైర్ అవుతాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
తొలి వన్డేలో తన బలహీనత అయిన ఆఫ్ స్టంప్ నకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడి ఔట్ అయిన కోహ్లి.. ఈసారి వికెట్ల ముందు దొరికాడు. వన్డే ఫార్మాట్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక పరుగులు (14,181) చేసిన కోహ్లిని ఇక టీమ్ ఇండియా జెర్సీలో చూడగలమా..? ఆసీస్ తో మూడో వన్డే తర్వాత అతడు ఈ ఫార్మాట్ కూ గుడ్ బై చెబుతాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.