5.38 అడుగుల బవుమా.. విలాస జీవి.. కోటీశ్వరుడు..ఆటలో చాలా ఎత్తైనవాడు

5.38 అడుగులు... ఇలాంటి ఎత్తుతో ఓ బ్యాట్స్ మన్ గా రాణించడమే కష్టం.. కానీ, అతడు కెప్టెన్ అయ్యాడు. వన్డేలు, టెస్టుల్లో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.. తాజాగా టెస్టు చాంపియన్ షిప్ లో ప్రపంచ విజేతగా నిలిపాడు.;

Update: 2025-06-15 21:30 GMT

5.38 అడుగులు... ఇలాంటి ఎత్తుతో ఓ బ్యాట్స్ మన్ గా రాణించడమే కష్టం.. కానీ, అతడు కెప్టెన్ అయ్యాడు. వన్డేలు, టెస్టుల్లో జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు.. తాజాగా టెస్టు చాంపియన్ షిప్ లో ప్రపంచ విజేతగా నిలిపాడు. దీంతో అతడి పేరు ప్రపంచ క్రికెట్ లో మార్మోగుతోంది. విశేషం ఏమంటే.. అతడి కెప్టెన్సీలో జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం.

ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో.. అది కూడా ఆస్ట్రేలియాతో మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటర్ల వైఫల్యం.. అయినా బవుమా తెగించి ఆడాడు... తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులతో ఓపికగా ఆడాడు. రెండో ఇన్నింగ్స్ లో పిక్కలు పట్టేసినా రన్నర్ సాయం లేకుండా 66 పరుగులు చేసి చారిత్రక విజయంలో భాగమయ్యాడు. జట్టు వెనుకంజలో ఉన్నా.. ఏమాత్రం నిరాశకు లోనవకుండా బవుమా చూపిన ధైర్యం ప్రశంసలు అందుకుంటోంది.

బవుమా రెండేళ్ల కిందటి వరకు విమర్శలు ఎదుర్కొన్నాడు. జట్టులో కనీసం నలుగురు నల్ల జాతీయులు ఉండాలన్న కోటా నిబంధన కారణంగానే అతడికి చోటు దక్కుతోందని నిందించారు. అలాంటివాడిని కెప్టెన్ చేశారని కూడా నవ్వారు. అయితే, బవుమా మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. డబ్ల్యూటీసీలో ఎంతో ఓపికగా ఆడుతూ ప్రశంసలు దక్కించుకున్నాడు. దీంతో గతంలో అతడిని ట్రోల్ చేసినవారే ఇప్పుడు కొనియాడుతున్నారు.

దక్షిణాఫ్రికా లెజిస్లేటివ్ రాజధాని కేప్ టౌన్ లో పుట్టాడు బవుమా. అక్కడి ఇరుకు వీధుల్లో ఆడుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. టి20 తరహా ఆటగాడు కాకపోవడంతో బవుమాకు లీగ్ లు ఆడే చాన్స్ లేదు. ఐపీఎల్ లోనూ అవకాశం రాలేదు. మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌ మెంట్లతో బవుమా ఆదాయం పొందుతుంటాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి వార్షిక కాంట్రాక్టు కింద రూ.కోటి పొందుతున్నాడు. మ్యాచ్ ఫీజులు అదనం. టెస్ట్ మ్యాచ్ కు రూ.3.6 0లక్షలు, వన్డేకు రూ.96 వేలు, టి20కి రూ.64 వేలు. స్పోర్ట్స్ ఫుట్‌ వేర్ బ్రాండ్ న్యూ బ్యాలెన్స్ తో బవుమా కాంట్రాక్టు చేసుకున్నాడు.

ఆడి టిటి స్పోర్ట్స్, మెర్సిడెస్, ఫోర్డ్ ముస్తాంట్ జీటీ కార్లు అతడి కలెక్షన్ లో ఉన్నాయి. ఖులనాథి ప్రాపర్టీ గ్రూప్ నకు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన బవుమా.. రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడి పెట్టాడు. 2018లో ఫిలా లోబిని వివాహం చేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలిచాక లార్డ్స్ మైదానంలో తన కొడుకుని ఎత్తుకుని తిరిగాడు బవుమా.

బవుమా మరీ తీసిపడేసే బ్యాటర్ ఏం కాదు.. 48 వన్డేల్లో 1847 పరుగులు చేశాడు. సగటు 44. ఇక 64 టెస్టుల్లో 3708 పరుగులు 37.80 సగటుతో సాధించాడు. 36 టి20ల్లో 670 పరుగులు చేశాడు. సగటు 21.6 సాధించాడు.

Tags:    

Similar News