ఐపీఎల్ 18.. తిలక్ టు సత్య.. తెలుగు కుర్రాళ్ల ఎదురీత

సరిగ్గా ఏడాది తర్వాత చూస్తే ఐపీఎల్ 18వ సీజన్ లో చాలామందికి గడ్డుకాలమే నడుస్తోంది. మొదటి మ్యాచ్ లో విఫలమైనా.. సిరాజ్ గుజరాత్ టైటాన్స్ కు మారిపోయి మెరుగ్గా రాణిస్తున్నాడు.;

Update: 2025-04-05 11:18 GMT

నిరుడు సరిగ్గా ఇదే సమయానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు ఆటగాళ్ల పేర్లు మారుమోగుతోంది.. ఓ వైపు ముంబై ఇండియన్స్ లో ఎడమచేతి వాటం హిట్టర్ తిలక్ వర్మ, మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ లో యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. వీరికితోడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో మొహమ్మద్ సిరాజ్ దుమ్మురేపుతున్నారు. ఇంకోవైపు అర్వపల్లి అవినాష్, షేక్ రషీద్ వంటి అండర్19 ప్లేయర్లు అదరగొడుతున్నారు.

సరిగ్గా ఏడాది తర్వాత చూస్తే ఐపీఎల్ 18వ సీజన్ లో చాలామందికి గడ్డుకాలమే నడుస్తోంది. మొదటి మ్యాచ్ లో విఫలమైనా.. సిరాజ్ గుజరాత్ టైటాన్స్ కు మారిపోయి మెరుగ్గా రాణిస్తున్నాడు. మిగతవారు మాత్రం కిందామీద పడుతున్నారు.

ముంబై ఎన్నో ఆశలతో రిటైన్ చేసుకున్న తిలక్ వర్మ తేలిపోతున్నాడు. జట్టు ఫామ్ తో పాటు సొంత ఫామ్ కూడా సరిగా లేకపోవడంతో అతడు పరుగులు చేయలేకపోతున్నాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌ తో మ్యాచ్‌ లో 23 బంతుల్లో 24 పరుగులతో ఉండగా.. రిటైర్డ్ ఔట్‌ చేయించి మిచెల్ సాంట్నర్‌ ను దింపారు. తిలక్ వంటి కుర్రాడికి ఇది ఎంతో అవమానమే అని చెప్పాలి.

తిలక్ తరహాలోనే టీమ్ ఇండియాకు ఆడుతున్న నితీశ్ రెడ్డి మరీ పేలవంగా ఆడుతున్నాడు. 30, 32, 0, 19 ఇవీ నితీశ్ వరుస స్కోర్లు. బౌలింగ్ లోనూ అతడి సేవలు పెద్దగా ఉపయోగపడడం లేదు. తిలక్, నితీశ్ ఇద్దరూ 120 కంటే తక్కువ స్ట్రయిక్ రేట్ తో పరుగులు సాధిస్తున్నారు.

మెరికల్లాంటి ఆటగాళ్లను టీమ్ ఇండియాకు అందించిన ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన కాకినాడ కుర్రాడు పేస్ బౌలర్ సత్యనారాయణ రాజు కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే, అతడికి ఇదే తొలి సీజన్ కాబట్టి కాస్త ఓపిక పట్టడంలో తప్పు లేదు.

గుంటూరు అబ్బాయి షేక్ రషీద్ చెన్నై జట్టులో ఉన్నాడు. ఇతడికి ఇంకా అవకాశం రాలేదు. విశాఖపట్నం కుర్రాడు పైలా అవినాష్ ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. ఇతడికీ మ్యాచ్ చాన్స్ రాలేదు.

Tags:    

Similar News