ముగ్గురు దిగ్గజాలు లేకుండా ఇంగ్లండ్ కు.. టీమ్ ఇండియా ఎంపిక కష్టమే
సరిగ్గా నెల రోజుల్లో ఇంగ్లండ్ టూర్ మొదలుకానుండగా.. ముందుగా రోహిత్, కోహ్లిల వంటి దిగ్గజ బ్యాట్స్ మెన్ స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాలి.;
బహుశా గత 15 ఏళ్లలో ఆ ముగ్గురిలో ఒక్కరన్నా లేకుండా టీమ్ ఇండియా విదేశీ పర్యటనలు చేసి ఉండదు.. గత పదేళ్లలో ఆ ముగ్గురిలో ఇద్దరన్నా లేకుండా టూర్ చేసి ఉండదు.. గత ఐదేళ్లలో ఆ ముగ్గురూ లేకుండా లేని విదేశీ టూర్ లేదు..
కానీ ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒక్కరూ లేకుండానే విదేశీ టూర్.. అది కూడా ఐదు మ్యాచ్ ల సుదీర్ఘమైన టెస్టు సిరీస్.. పైగా ఆడబోయేది ఇంగ్లండ్ లో. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా ఎంపిక ఎంతో కష్టం అనేది చెప్పాల్సిన పనిలేదు.
జనవరిలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్, 500కు పైగా వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, గత వారం కెప్టెన్ రోహిత్ శర్మ, తాజాగా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికారు.
సరిగ్గా నెల రోజుల్లో ఇంగ్లండ్ టూర్ మొదలుకానుండగా.. ముందుగా రోహిత్, కోహ్లిల వంటి దిగ్గజ బ్యాట్స్ మెన్ స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఎందుకంటే అశ్విన్ ను ఇటీవల విదేశాల్లో టెస్టుల్లో తక్కువగా ఆడించారు.
టెస్టుల్లో ఎంతో కీలకమైన ఓపెనింగ్ స్థానంలో దిగుతున్నాడు రోహిత్. కోహ్లిది మిడిలార్డర్ కు పునాది లాంటి నాలుగో స్థానం. మరి ఇంగ్లండ్ టూర్ కు ఎంపిక ఎలా?
ఇంగ్లండ్ టూర్ కోసం ఇప్పటికే 35 మందితో ప్రాబబుల్స్ ను ఎంపిక చేశారు. వీరిలోంచే జట్టును ఎంపికచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రోహిత్, కోహ్లిలను కూడా తీసివేయాలి. ఇక ఈ వారంలోనే ఇంగ్లండ్ టూర్ కు ఇండియా-ఎ జట్టును ఎంపిక చేస్తారని చెబుతున్నారు. ఈ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్ అంటున్నారు. ఈ జట్టులో కరుణ్ నాయర్, తమిళనాడు బ్యాటర్ బాబా ఇంద్రజిత్, థనుష్ కొటియన్ వంటివారున్నారు.
సీనియర్ జట్టుకు శుబ్ మన్ గిల్ కెప్టెన్ గా ఖాయం. మంచి ఓపెనర్ అయిన అభిమన్యుతో పాటు కరుణ్ నాయర్ ను సీనియర్ జట్టుకు తీసుకుంటారని అనుకున్నాం.. వీరికి యువ ఓపెనర్ సాయి సుదర్శన్ గట్టి పోటీ ఇస్తున్నాడు.
తెలుగు ఆల్ రౌండర్ కు చోటుందా?
ఆల్ రౌండర్ కోటాలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి సీనియర్ ఆల్ రౌండర్, దేశవాళీల్లో దుమ్మురేపిన శార్దూల్ ఠాకూర్ గట్టి పోటీ ఇస్తున్నాడు. మరోవైపు మొదటి చాయిస్ రిషభ్ పంత్ అయినప్పటికీ తోడుగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ను తీసుకుంటారు.
కోహ్లి స్థానం మాత్రం అతడిదే..
అత్యంత కీలకమైన నాలుగో స్థానంలో కోహ్లికి తగిన ప్రత్యామ్నాయం శ్రేయస్ అయ్యర్. కచ్చితంగా అయ్యర్ ను ఇంగ్లండ్ లో ఆడించడం ఖాయం. గత ఆస్ట్రేలియా టూర్ లో ఆడిన యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డాడు. అతడు కోలుకున్నా ఎంపిక కష్టమే.
మేటి పేస్ బౌలర్ మొహమ్మద్ షమీని గాయాలు దెబ్బతీశాయి. గతంలోలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు.
బుమ్రాను కూడా ఇంగ్లండ్ లో ఐదు టెస్టులూ ఆడించకపోవచ్చు. దీంతో హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ పై చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయి.