టి20 ప్ర‌పంచ క‌ప్.. 4 గ్రూప్ లు.. ఒకే గ్రూప్ లో భార‌త్-పాక్

మ‌ళ్లీ ఇంత‌లోనే టి20 ప్ర‌పంచ క‌ప్ వ‌చ్చేసింది. అది కూడా మ‌రో మూడు నెల‌ల్లోనే అభిమానుల‌ను క‌నువిందు చేయ‌నుంది.;

Update: 2025-11-22 12:30 GMT

ఏడాదిన్న‌ర కింద‌టే టి20 ప్ర‌పంచ క‌ప్ ముగిసింది.. టీమ్ ఇండియా విజేత‌గా నిలిచింది. దాంతోనే భార‌త దిగ్గ‌జ ఆట‌గాళ్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి, కీల‌క ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాలు టి20ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. మ‌ళ్లీ ఇంత‌లోనే టి20 ప్ర‌పంచ క‌ప్ వ‌చ్చేసింది. అది కూడా మ‌రో మూడు నెల‌ల్లోనే అభిమానుల‌ను క‌నువిందు చేయ‌నుంది. పైగా మ‌న భార‌త్ లోనే ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌నుంది. టీమ్ ఇండియా డిఫెండింగ్ చాంపియ‌న్ గా టోర్నీలో అడుగుపెట్ట‌నుంది. 2009 త‌ర్వాత టీమ్ ఇండియా ఈ హోదాలో టి20 ప్రపంచ క‌ప్ ఆడ‌నుండ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతానికి టి20 ఫార్మాట్ కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోనే బ‌రిలో దిగుతుంద‌ని భావించ‌వ‌చ్చు. అయితే, త్వ‌ర‌లో ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తో జ‌ర‌గ‌నున్న టి20 సిరీస్ ల‌లో అత‌డి ఫామ్ ను చూశాక సెల‌క్ట‌ర్లు నిర్ణ‌యం తీసుకునే చాన్సుంద‌ని భావించ‌వ‌చ్చు. కాగా, ఫిబ్ర‌వ‌రి-మార్చిలో టి20 ప్ర‌పంచ క‌ప్ కు భార‌త్ తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఎన్న‌డూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 20 జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.

4 గ్రూప్ ల‌లో ఏ జ‌ట్లు ఎందులో?

గ్రూప్ న‌కు ఐదేసి చొప్పున మొత్తం 20 జ‌ట్ల‌ను 4 గ్రూపులుగా విభ‌జించ‌నున్నారు. భార‌త్, పాక్ ఒకే గ్రూప్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులోనూ ప‌సికూన‌లైన అమెరికా, న‌మీబియా, నెద‌ర్లాండ్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం. రెండో గ్రూప్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక‌, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమ‌న్, మూడో దాంట్లో ఇంగ్లండ్, వెస్టిండీస్, ఇట‌లీ, బంగ్లాదేశ్, నేపాల్, నాలుగో గ్రూప్ లో ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గాన్, యూఏఈ, కెన‌డా ఉండ‌న్నుట్లు చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా భార‌త్-పాక్ ఒకే గ్రూప్ లో ఉండ‌డ‌మే ఈ టోర్నీ హైలైట్. అంతేగాక గ‌త టి20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్థాన్ ను ఓడించిన అమెరికా కూడా ఉండ‌డం విశేషం. నెద‌ర్లాండ్స్ కూడా త‌క్కువ జ‌ట్టేమీ కాదు. త‌న‌దైన రోజున సంచ‌ల‌నాలు చేయ‌గ‌ల‌దు.

పాక్ మ్యాచ్ ల‌న్నీ శ్రీలంక‌లోనే

పెహ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్థాన్ ఆట‌గాళ్ల‌ భార‌త్ వీసాలు ఇవ్వ‌డం లేదు. దీంతో ఆ దేశ క్రికెట‌ర్లు భార‌త్ తో మ్యాచ్ లను శ్రీలంక‌లో ఆడ‌నున్నారు. ఒక‌వేళ భార‌త్, పాక్ ఫైన‌ల్ చేరినా అదికూడా లంక‌లోనే ఉంటుందనే క‌థ‌నాలు వ‌చ్చాయి. కాగా, ఈ టి20 ప్రపంచ క‌ప్ లో ఒమ‌న్, యూఏఈ, నేపాల్ దేశ జ‌ట్ల ఆట ఎలా ఉంటుందో చూసేందుకు చాన్స్ రానుంది. ఒమ‌న్, యూఏఈ జ‌ట్ల ఆట‌ ఇప్ప‌టికే భార‌త అభిమానుల‌కు ప‌రిచ‌య‌మే. కానీ, నేపాల్ గురించి తెలియ‌దు.

Tags:    

Similar News