టీమ్‌ ఇండియాకు షాక్‌.. కెప్టెన్‌కు గాయం.. అవసరమైతే లండన్‌లో సర్జరీ

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతుండగా.. టీమ్‌ ఇండియా కెప్టెన్‌కు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది.;

Update: 2025-06-20 03:03 GMT

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతుండగా.. టీమ్‌ ఇండియా కెప్టెన్‌కు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. తీవ్ర గాయంతో బాధపడుతున్న అతడు ఇంగ‍్లండ్‌లోనే చికిత్స పొందనున్నాడు. పరిస్థితి ప్రకారం అవసరమైతే శస్త్రచికిత్స చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో టీమ్‌ ఇండియా కొత్త కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో ఆడనుంది. ఇప్పటికే ఈ అత‍్యంత కీలక సిరీస్‌కు ముందే స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లితో పాటు దిగ్గజ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్మెంట్‌ ఇచ్చారు. దీంతో ముగ్గురు కొత్తవారు లేదా బెంచ్‌పై ఉన్నవారితో బరిలో దిగుతోంది. కాగా, ఇదే సమయంలో కెప్టెన్‌కు గాయం కావడం గమనార‍్హం.

అయితే, మీరు చదువుతున్నది టెస్టు కెప్టెన్‌ గిల్‌ గురించి కాదు.. టి20 సారథి సూర్యకుమార్ యాదవ్ గురించి. ఇటీవల ఐపీఎల్‌లో దుమ్మురేపిన సూర్య.. తన జట్టు ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌లలో 65.18 సగటు, 167.9 స్ట్రైక్ రేట్‌తో 717 పరుగులు చేశాడు. అయితే, లీగ్‌లోకి సూర్య కొంత ఆలస్యంగా వచ్చాడు. కారణం.. గాయం. ఇప్పుడు మళ్లీ గాయపడ్డాడు. సూర్య స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ప్రత్యేక చికిత్స కోసం లండన్ వెళ్లాడు. 16 మ్యాచ్‌లలో 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించి, వరుసగా అత్యధికంగా 25 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే సూర్య ముంబై టి20 లీగ్‌లోనూ ఆడాడు. అయితే, ఐపీఎల్‌ సందర్భంగా గాయం బాగా తిరగబెట్టినట్లు తెలుస్తోంది.

వీలైతే శస్త్రచికిత్స కూడా..

గతం నుంచి ఉన్న ఈ గాయం నుంచి శాశ్వతంగా కోలుకోవాలని, అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవాలని కూడా సూర్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. మరో 2 నెలలు టి20 మ్యాచ్ లు, సిరీస్ లు లేవు. ఇప్పుడే గాయానికి చికిత్స పొందితే కోలుకోవడానికి తగినంత సమయం దొరుకుతుందని భావిస్తున్నాడు. ఆపై బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ సాధించవచ్చని చూస్తున్నాడ. టీమ్‌ ఇండియా వచ్చే టి20 సిరీస్‌ ను ఆగస్టు చివరిలో (మూడు మ్యాచ్ లు) బంగ్లాదేశ్‌లో ఆడనుంది. అంటే 2 నెలలకు పైనే టైమ్‌ ఉందన్నమాట.

Tags:    

Similar News