ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిది.. SRH కు వరుసగా మూడో ఓటమి తెచ్చింది..

ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరు అలానే ఉందనిపిస్తోంది. SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పట్టుదల జట్టును ఇబ్బందుల్లోకి నెడుతోంది.;

Update: 2025-04-04 04:41 GMT

తెలియక తప్పు చేస్తే క్షమించవచ్చు, కానీ తెలిసీ తెలిసీ మొండిగా వ్యవహరిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరు అలానే ఉందనిపిస్తోంది. SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పట్టుదల జట్టును ఇబ్బందుల్లోకి నెడుతోంది.

నిన్న కోల్ కతాలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. అస్సలు పోటీనే ఇవ్వలేదు. అంతటి బలమైన జట్టు ఇలా దారుణంగా ఓడిపోవడాన్ని అసలు ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు. ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా మూడో ఓటమి. ప్రతి మ్యాచ్ గడుస్తున్న కొద్దీ జట్టు మునుపెన్నడూ లేనంత బలహీనంగా మారుతోంది. వారి డ్రెస్సింగ్ రూమ్ ప్రేరణ దృశ్యాల ద్వారా, ఆటగాళ్ళు అతి విశ్వాసంతో తయారవుతున్నారు, కానీ మైదానంలో వారి ఆటతీరు పూర్తిగా నిరాశపరిచింది. జట్టు పేపర్ పై మాత్రమే బలంగా కనిపిస్తోంది, ఎక్కువ అంచనాలు ఉన్న ఆటగాళ్లందరూ వారి అంచనాలను అందుకోవడం లేదు. షమీ, హర్షిత్ పటేల్, సిమర్‌జీత్, జెషాన్ , మెండిస్ వంటి బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. SRH జట్టుకు సమూల మార్పు అవసరం. లేకపోతే వారు టోర్నమెంట్ నుండి మొదటిగా నిష్క్రమించే జట్టు అవుతారు. ఇంతలో KKR బౌలింగ్ , బ్యాటింగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బలమైన పునరాగమనం చేసింది.

గత సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చిన కమిన్స్, అభిమానుల మన్ననలు పొందాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడకపోయినా హైదరాబాద్ కోసం ఆడటానికి ముందుకొచ్చిన అతని నిబద్ధత అందరినీ మెప్పించింది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 286 పరుగులు చేసినప్పుడు హీరోగా మారిన కమిన్స్ సారథ్యంలో జట్టు వరుసగా మూడు ఓటములు చవిచూడటం అభిమానులకు మింగుడుపడటం లేదు. దీనికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకపోవడమేనని సీనియర్ ఆటగాళ్లు సైతం అంటున్నారు.

"అనువుగాని చోట అధికులమనరాదు" అనే సామెతను హైదరాబాద్ కెప్టెన్ పట్టించుకోవడం లేదు. తొలి మ్యాచ్‌లో 286 పరుగులు చేయగానే, ప్రతి మ్యాచ్‌లోనూ 300 పరుగులే తమ లక్ష్యం అని పదే పదే చెప్పడం అతడి మొండి వైఖరికి నిదర్శనం. లక్నోతో ఓడిపోయిన తర్వాత కూడా అదే మాట చెప్పడం గమనార్హం.

ఐపీఎల్‌లో 300 పరుగులనేది అంతిమ లక్ష్యం కాదు. ఆటను ఎంత బాగా ఆడాం, కష్ట సమయాల్లో ఎలా నిలబడ్డాం అనేదే ముఖ్యం. ఆస్ట్రేలియాకు ఎన్నో విజయాలు అందించిన కెప్టెన్‌గా కమిన్స్‌కు ఈ విషయం తెలియనిది కాదు. కానీ, జట్టులో ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిర్లక్ష్యపు బౌలింగ్, ప్రణాళిక లేని బ్యాటింగ్, సోమరితనంతో కూడిన ఫీల్డింగ్ జట్టుకు శాపంగా మారాయి. ఢిల్లీ, లక్నో, కోల్‌కతాపై జరిగిన మ్యాచ్‌ల్లో ఇవి కొట్టొచ్చినట్టు కనిపించాయి.

ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకునే ప్రయత్నం ఆటగాళ్లలో కనిపించడం లేదు. దీనివల్ల జట్టు పరువు పోవడమే కాకుండా, అభిమానుల ఆశలు కూడా అడియాసలవుతున్నాయి. నిన్న కోల్‌కతాలో టికెట్ ధరలు పెంచినా అభిమానులు భారీగా వచ్చారు, వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ అభిమానులే. ఇలాగే ఓటములు కొనసాగితే, అభిమానులు స్టేడియాలకు రారు. డబ్బులు పెట్టి ఓటమి చూడటానికి ఎవరూ ఇష్టపడరు.

ఇప్పటికైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ తన ఆలోచన మార్చుకుంటే మంచిది, లేకపోతే గ్రూప్ దశలోనే నిష్క్రమించడం ఖాయం.

Tags:    

Similar News