హైదరాబాద్ పబ్ లు.. మాల్దీవ్ విందులు.. సన్ రైజర్స్ దారుణ ఓటమి చిందులు

విహారం, వినోదం, విందులను ఎవరూ కాదనరు.. ఎప్పుడూ క్రికెట్ అనే పరిస్థితి నుంచి రిలాక్స్ కోసం ఇలాంటివి ఉండాల్సిందే.;

Update: 2025-05-03 11:15 GMT

పది మ్యాచ్ లలో మూడు ఓటములు.. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానం.. రన్ రేట్ కూడా అత్యంత దారుణం.. ఛేజింగ్ లో దమ్ము లేదు.. మొదట బ్యాటింగ్ లో చార్మ్ లేదు..

నిరుడు మైదానంలో దిగితే 300 కొడతారనే హైప్.. ఈసారి కిందా మీద పడినా 200 కొట్టలేని దుస్థితి.. గెలిచిన మూడు మ్యాచ్ లు కూడా బలహీన జట్లపైనే.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ఇదీ సన్ రైజర్స్ హైదారాబాద్ పరిస్థితి. నిరుడు రన్నరప్ జట్టు ఇదేనా? అనే డౌట్.

గ్రౌండ్ లో ప్రదర్శన అలా ఉంటే.. గ్రౌండ్ బయట..? ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో గెలిచాక ఇక ఐపీఎల్ టైటిల్ సాధించామని అనుకున్నారేమో..? సన్ రైజర్స్ జట్టును మాల్దీవ్స్ టూర్ కు పంపారు. అక్కడ బీచ్ లలో ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. తీరా శుక్రవారం గుజరాత్ తో మ్యాచ్ లో చూస్తే దారుణంగా ఓడిపోయారు. దీనికిముందు హైదరాబాద్ లో పబ్ లలో తిరుగుతూ కనిపించారు సన్ రైజర్స్ ఆటగాళ్లు.

విహారం, వినోదం, విందులను ఎవరూ కాదనరు.. ఎప్పుడూ క్రికెట్ అనే పరిస్థితి నుంచి రిలాక్స్ కోసం ఇలాంటివి ఉండాల్సిందే. కానీ, జట్టు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు టూర్లు చేసి, మైదానంలో దారుణ ప్రదర్శన కనబరిస్తేనే విమర్శలు వస్తాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం అలాంటి విమర్శలనే ఎదుర్కొంటోంది.

జట్టు కూర్పే బాగోలేదా?

సన్ రైజర్స్ ఆటగాళ్ల ఎంజాయ్ మెంట్ ను పక్కనపెడితే జట్టు కూర్పు కూడా విమర్శలకు తావిస్తోంది. టాప్ ఆర్డర్ (ఓపెనర్లు, వన్ డౌన్) ముగ్గురూ ఎడమ చేతి బ్యాటర్లే. మంచి ఆటగాళ్లే అయినా లెఫ్ట్-రైట్ కాంబినేషన్ చూడాలి కదా? ఇక బౌలింగ్ లోనూ పదును లేదు. టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తేలిపోయాడు. అతడి కంటే హర్షల్ పటేల్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఇక సమర్థుడైన స్పిన్నర్ లేనే లేదు. జీషన్ అన్సారీని తీసుకొచ్చినా అతడు ఇంకా కొత్తవాడే. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మంచి బౌలర్ అయినప్పటికీ.. ఈసారి ఐపీఎల్ లో రాణించలేదు.

సీజన్ మధ్యలో ఆటగాళ్లను టూర్ తీసుకెళ్లడం కూడా సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పోనీ, విరామం, వినోదం తర్వాత ఆటగాళ్లు రెచ్చిపోతారు అనుకుంటే.. అదేమీ జరగలేదు. ఫలితంగా గుజరాత్ చేతిలోనూ ఓడిపోయి ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు ఔట్ అయ్యారు.

ఆడేసుకుంటున్న సోషల్ మీడియా సన్ రైజర్స్ మైదానంలో సరిగా ఆడకపోవడాన్ని తేలిగ్గానే తీసుకున్న అభిమానులు.. మైదానం బయట వారి తీరును తట్టుకోలేకున్నారు. ఫలితంగా ట్రోల్స్- మీమ్స్ తో సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.

Tags:    

Similar News