టీమ్ ఇండియా గడప తొక్కిన కడప అమ్మాయి
తాజాగా మరో తెలుగమ్మాయి టీమ్ ఇండియా గడప తొక్కింది. అది కూడా వన్డే ఫార్మాట్ లో జరిగే సిరీస్ కు కావడం గమనార్హం.;
అది ఏ దశలో అయినా టీమ్ ఇండియాకు ఎంపికవడం అంటే సామాన్యమైన విషయం కాదు.. ఎంతో పోటీ ఉండే క్రికెట్ లో ఎన్నో అవాంతరాలు దాటుకుని అంతకు కష్టపడితేనే దేశానికి ఆడే అవకాశం లభిస్తుంది. కాగా, కొన్నాళ్లుగా తెలుగు యువత టీమ్ ఇండియా గడపను సులువుగానే తొక్కుతున్నారు అని చెప్పాలి.
అబ్బాయిల క్రికెట్ లో గుంటూరు కుర్రాడు షేక్ రషీద్, సిద్దిపేట యువకుడు అర్వపల్లి అవినాష్ అండర్ 19 ప్రపంచ కప్ ఆడారు. మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి వంటి వారు సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మహిళల క్రికెట్ లో భద్రాచలం అమ్మాయి గొంగిడి త్రిష రెండు నెలల కిందట అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యురాలు. ఇక హైదరాబాద్ కు చెందిన అరుంధతీ రెడ్డి ఐదారేళ్లుగా సీనియర్ జట్టులో రెగ్యులర్ సభ్యురాలు. వీరంతా దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్ లేని లోటును భర్తీ చేస్తున్నారు.
తాజాగా మరో తెలుగమ్మాయి టీమ్ ఇండియా గడప తొక్కింది. అది కూడా వన్డే ఫార్మాట్ లో జరిగే సిరీస్ కు కావడం గమనార్హం. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన శ్రీచరణి.. శ్రీలంకలో జరిగే ముక్కోణపు ట్రోఫికి ఎంపికైంది. ఎడమచేతివాటం స్పిన్నర్ బ్యాటర్ అయిన శ్రీచరణి స్పిన్ ఆల్ రౌండర్ అని చెప్పుకోవాలి.
ఇప్పటికే విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ జట్టుకు ఆడింది శ్రీచరణి. ఇప్పుడు తొలిసారిగా టీమ్ ఇండియాకు ఎంపికైంది. ఈ నెల 27 నుంచి మే 11 వరకు జరిగే శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా పాల్గొననుంది. ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా మూడో జట్టుగా ఆడనుంది.
వెటరన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా, ఎడమచేతి వాటం బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.